1996లో వచ్చిన “భారతీయుడు” సృష్టించిన సంచలనాలను ప్రేక్షకులు ఇంకా మరువలేదు. శంకర్ (Shankar) గ్రాండియర్, కమల్ హాసన్ (Kamal Haasan) నటన, రెహమాన్ (A.R.Rahman) సంగీతం.. ఇలా ప్రతి ఒక్క అంశం ఇప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకుల మెదళ్ళలో మాత్రమే కాదు మనసుల్లోనూ మెదులుతూనే ఉంది. ఆ చిత్రానికి సీక్వెల్ గా దాదాపు 18 ఏళ్ల తర్వాత విడుదలైన చిత్రం “భారతీయుడు 2” (Bharateeyudu 2) . ఈ సీక్వెల్ కు సంగీతం అనిరుధ్ (Anirudh Ravichander) అందించడం విశేషం. మరి ఈ సీక్వెల్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: అవినీతి అంతకంతకూ పెరిగిపోతుంటుంది, ఆ అన్యాయాన్ని ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా వేలెత్తి చూపిస్తూ అవగాహన కల్పిస్తుంటారు టీం “బార్కింగ్ డాగ్స్”. చిత్ర అరవింద్ (సిద్ధార్ధ్ Siddharth)), ఆర్తి (ప్రియభవాని శంకర్ Priya Bhavani Shankar) తదితరులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా “కమ్ బ్యాక్ ఇండియన్” అనే నినాదాన్ని వైరల్ చేసి సేనాపతి (కమల్ హాసన్)ను ఇండియాకి రప్పిస్తారు. అయితే.. సీ.బి.ఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా Bobby Simha ) సేనాపతిని పట్టుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తుంటాడు.
సేనాపతి టార్గెట్ ఎవరు? అక్రమాలు లేని భారతదేశాన్ని సాధించడం కోసం భారతీయుడు మొదలెట్టిన రెండో స్వాతంత్ర్య ఉద్యమం ఎలా ముందుకెళ్లింది? అనేది తెలియాలంటే “భారతీయుడు 2” చూసి.. “భారతీయుడు 3” వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
నటీనటుల పనితీరు: 70కి దగ్గరవుతున్న కమల్ హాసన్ “భారతీయుడు 2″లో కనిపించిన గెటప్స్ లో మెప్పించడం కోసం వేసుకున్న ప్రోస్థెటిక్స్ కోసమైనా ఆయన్ను మెచ్చుకొని తీరాలి. ఈ సినిమాలో ఆయన దాదాపు 6 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడు. అయితే.. ఆయనకి ఈ సినిమాలో ఎమోషన్స్ పండించే అవకాశం ఎక్కువ రాలేదు. అసలు సినిమా మొత్తం మూడో భాగంలోనే ఉందని సినిమా చివరన వచ్చే ట్రైలర్ తో స్పష్టమైంది.
సిద్ధార్ధ్ మంచి ఇంపాక్ట్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. రకుల్ (Rakul Preet Singh) పాత్ర నిడివి చాలా తక్కువ. అలాగే.. ప్రియభవాని శంకర్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించినప్పటికీ, పాత్రను పండించలేకపోయింది. ఇక పరభాషా నటులు బోలెడుమంది విలన్లుగా కనిపించి, కనుమరుగయ్యారు కానీ.. ఎలాంటి ఆసక్తి కలిగించలేకపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: రవి వర్మన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ను ఆయన తెరకెక్కించిన తీరు ఆడీయన్స్ ను థ్రిల్ చేస్తుంది. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ ఫైట్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అనిరుధ్ నేపధ్య సంగీతం & పాటలు ఆశించిన స్థాయిలో లేకున్నా.. సినిమా టోన్ కి తగ్గట్లుగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ శంకర్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా గోల్డ్ రూమ్ సెట్ ప్రేక్షకులు నోరెళ్ళబెట్టేలా ఉన్నాయి. అలాగే.. క్యాలెండర్ సాంగ్ కూడా కనువిందుగా ఉంది.
దర్శకుడు శంకర్ ఈ సీక్వెల్ గా రెండు భాగాలుగా తీయాలనుకోవడంతో అసలు కథ మొత్తం మూడో భాగానికే పరిమితం అయిపోయింది. అందువల్ల.. శంకర్ సినిమాలు ఆకట్టుకొనే స్థాయిలో “భారతీయుడు 2” మెప్పించడానికి కాస్త ఇబ్బందిపడినా.. మూడో భాగానికి మంచి సెటప్ గా పనికొచ్చింది. ఎలాగూ శంకర్ ఈ చిత్రాన్ని 2025 మొదట్లోనే విడుదల చేస్తానని ప్రకటించారు కాబట్టి, షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి మూడో భాగంతో ఆయన ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
విశ్లేషణ: “భారతీయుడు 2” చిత్రం మూడు గంటల నిడివి కాస్త ఇబ్బందిపెట్టినా.. కమల్ హాసన్ నటన, అనిరుధ్ సంగీతం, గ్రాండియర్, శంకర్ టేకింగ్ & టెక్నికాలిటీస్ ను థియేటర్లలో ఎంజాయ్ చేయడం కోసం కచ్చితంగా చూడాల్సిన చిత్రం.
ఫోకస్ పాయింట్: నవసమాజ కీచకుల భరతం పట్టిన “భారతీయుడు 2”.
రేటింగ్: 2.5/5