రవితేజ తన మాస్ మూసలో నుండి కాస్త బయటికి వచ్చి చేసిన సినిమా “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ & సాంగ్స్ మంచి ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం..!!

కథ: రామసత్యనారాయణ (రవితేజ) బిజినెస్ ట్రిప్ కోసం స్పెయిన్ వెళ్లి.. అక్కడ మానస శెట్టి (ఆషిక రంగనాథ్)ను చూసి మోహిస్తాడు. తాను చేసిన తప్పును ఒప్పుకొని తరుణంలో మానస మొహం చూసి చెప్పలేక హైదరాబాద్ వచ్చేస్తాడు.
కట్ చేస్తే.. కట్టుకున్న భార్య బాలామణి (డింపుల్ హయాతి)కి నిజం చెప్పలేక, అబద్ధం దాయలేక ఇబ్బందిపడుతున్న తరుణంలో, మానస హైదరాబాద్ రావడం.. ఇద్దరి నడుమ రామసత్యనారాయణ ఎలా నలిగిపోయాడు? చివరికి ఎలా బయటపడ్డాడు? అనేది “భర్త మహాశయులకు విజ్ఞప్తి” కథాంశం.

నటీనటుల పనితీరు: రవితేజ సెటిల్డ్ & కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. వరుసబెట్టి ఊరమాస్ సినిమాలు చూసిన ఆడియన్స్ కి రవితేజ కొత్తగా కనిపించాడు. లుక్స్ & కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి.
ఆషిక అందంతోపాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజతో కెమిస్ట్రీ బాగా సెట్ అయ్యింది. డింపుల్ హయాతి పాత్రకి సరైన ఎస్టాబ్లిష్మెంట్ లేక పాటలకే పరిమితం అయిపోయినట్లుగా ఉంటుంది. సన్నివేశాల్లో ఉన్నప్పటికీ.. అది మిగతా పాత్రలని లీడ్ చేయడానికి తప్పితే.. క్యారెక్టర్ ఆర్క్ అనేది లేదు.
వింటేజ్ సునీల్ కనిపించాడు. సత్య కామెడీ సెకండాఫ్ లో పర్లేదు కానీ.. ఫస్టాఫ్ లో విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేస్తూ ఓవర్ యాక్షన్ తో చిరాకుపెట్టాడు.
వెన్నెల కిషోర్, సోనియా, మురళీధర్ గౌడ్ ల పాత్రలు అక్కడక్కడా నవ్వించారు. తారక్ పొన్నప్ప పాత్ర కథలో సరిగా కూర్చోలేకపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా డీసెంట్ సినిమా ఇది. స్పెయిన్ ఎపిసోడ్స్ & హైదరాబాద్ ఎపిసోడ్స్ ను చాలా లావిష్ గా చూపించారు. అందుకు సినిమాటోగ్రాఫర్ & ప్రొడక్షన్ టీమ్ ను మెచ్చుకోవాలి.
భీమ్స్ మళ్లీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా పాటలు, బీజియం మూడ్ కి తగ్గట్లుగా ఉన్నాయి. కార్తీకదీపం & పిన్నీ సీరియల్ సాంగ్స్ రీమిక్స్ అదిరింది. పాటలు కూడా ఎంగేజింగ్ గా ఉన్నాయి.
దర్శకుడు కిషోర్ తిరుమలను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. సినిమాలో బోర్డర్ క్రాస్ చేయడానికి చాలా స్కోప్ ఉన్నప్పటికీ, నిబద్ధతగా ఎక్కడా అసభ్యత లేకుండా సినిమాని తెరకెక్కించాడు. అయితే.. కిషోర్ తిరుమల నుండి కోరుకునే సెన్సిబిలిటీస్ అనేది సినిమాలో మిస్ అయ్యాయి. ఆషిక రంగనాథ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న టైమ్ ను డింపుల్ క్యారెక్టర్ మీద చూపించి ఉంటే.. “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” ఫీల్ కలిగిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యేది.
అలాంటిది.. ఆషికతో స్పెయిన్ ఎపిసోడ్ ను కంగారుగా చుట్టేసి, డింపుల్ క్యారెక్టర్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల.. అసలు సినిమాలో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకుండా అయిపోయింది. అలాగే.. చివర్లో ఇచ్చిన క్లోజర్ కూడా కిషోర్ తిరుమల స్థాయికి తగ్గట్లుగా లేదు. ఇంతకు మించి సాగదీస్తే బాగోదు అని ముగించినట్లుగా ఉంది. ఈ రెండు విషయాల్లో కిషోర్ మార్క్ మిస్ అవ్వడంతో.. “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే సినిమా హిట్ స్టేటస్ కి అరడుగు దూరంలో ఆగిపోయి.. డీసెంట్ సినిమాగా నిలిచిపోయింది.

విశ్లేషణ: పాత కథను కొత్తగా చెప్పడమే అసలైన కత్తి మీద సాము. అందులోనూ ఈ తరహా కథను, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను ఏళ్లుగా చూస్తున్నాం. అలాంటప్పుడు క్యారెక్టరైజేషన్ లో కొత్తదనంతోనే కథను నిలబెట్టాలి. “భర్త మహాశయులకు విజ్ఞప్తి”లో లోపించింది అదే. దానికి తోడు ఎండింగ్ మరీ పేలవంగా ఉండడం అనేది ప్రేక్షకుల్ని సంతృప్తిపరచలేకపోయింది. అయితే.. రవితేజ పెర్ఫార్మెన్స్, భీమ్స్ మ్యూజిక్ & కొన్ని ఫన్నీ ఎపిసోడ్స్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు.

ఫోకస్ పాయింట్: విజ్ఞప్తిలో వెసులుబాటు ఎక్కువయ్యింది!
రేటింగ్: 2.5/5
