పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ ఉండాలి. అందులోనూ పవన్ పెద్ద స్టార్ హీరో కాబట్టి.. ఆయన అభిమానులు కూడా ఇవి ఎక్కువ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండాలని వారు కోరుకుంటారు. అయితే ఇక నుండీ పవన్ సినిమాల్లో అలాంటివి ఏమీ ఉండవనేది తాజా సమాచారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఒకప్పటిలాగా రొమాన్స్, లవ్ స్టోరీస్, గన్ పట్టుకుని ప్రత్యర్థులను చిత్తుగా కాల్చడం వంటివి.. చేస్తే కరెక్ట్ కాదు అని పవన్ భావిస్తున్నారట.
ఇప్పుడు పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం మంచి మెసేజ్ తో కూడుకున్న సినిమా. తరువాత క్రిష్ డైరెక్షన్లో పవన్ నటించే సినిమా కూడా పీరియాడిక్ డ్రామా అని తెలుస్తుంది. పవన్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హారీష్ శంకర్ తో కూడా పవన్ ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. చెప్పాలంటే హరీష్.. పక్కా మాస్ సినిమాలే చేస్తుంటాడు. కానీ ఈసారి పవన్ తో.. రాజకీయ నేపథ్యంలో సాగే కథాంశంతోనే సినిమా చెయ్యబోతున్నాడట. ఒక సామజిక అంశం చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందట.
ఇది కూడా పవన్ సూచన మేరకే జరుగుతుందని ఇన్సైడ్ టాక్. పవన్ సినిమాల్లోకి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు. అయితే పవన్ సినిమాలు తీస్తుండడంతో సంతోషించాలా.. లేక వారిని ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమాలు చేస్తున్నందుకు బాధపడాలా? అనే డైలమాలో వారున్నట్టు తెలుస్తుంది.