సీరియల్: అత్త అల్లుడు అమెరికా మోజు
నటీనటులు: బిగ్‌బాస్ హౌస్‌మేట్స్
దర్శకత్వం: ఎవరికి వారు
మిగిలిన అన్ని ఫ్రేమ్స్: బిగ్‌బాస్
ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌గా బిగ్‌బాస్ ‘బీబీ టీవీ’ టాస్క్‌ని ఇచ్చాడు. ‘అత్త అల్లుడు అమెరికా మోజు’ పేరుతో ఓ సీరియల్ నటించి, చూపించమన్నాడు. అందులో ఎంతగా ఎంటర్‌టైన్మెంట్ ఇస్తే అంత మంచిది అని కూడా సూచించాడు. ఇంట్లో ఉన్నవాళ్లు రెండు టీమ్‌లు మారి… ఒక టీమ్ సీరియల్‌లో నటించగా, మిగిలిన టీమ్ మధ్యలో యాడ్స్ చేశారు. మరి ఆ సీరియల్ ఎలా ఉంది.. కథేంటి తదితర వివరాలు చూద్దాం.
ఏ పాత్రలో ఎవరు?
కోడల్ని వేదిస్తూ… కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకునే గయ్యాళి అత్తగా కళ్యాణి కనిపిస్తుంది. ఆమె కొడుకుగా, తల్లి మాటను జవదాటని కొడుకుగా అభిజీత్, అతని భార్యగా సుజాత కనిపించింది. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొట్టుకునే కళ్యాణి కూతురుగా దివి నటించింది. అమెరికా పెళ్లి కొడుకు అయిన అఖిల్‌కు ఇచ్చి దివిని పెళ్లి చేయాలని కళ్యాణి చూస్తుంటుంది. కళ్యాణి ఇంట్లో మతిమరుపు అకౌంటెంట్‌గా కుమార్ సాయి కనిపిస్తాడు. అక్కడి మాటలు ఇక్కడ … ఇక్కడి మాటలు అక్కడ చెప్పే కళ్యాణి ఇంట్లో పనిమిషిగా దేవి నాగవల్లి యాక్ట్ చేస్తుంది.
కథేంటంటే?
తల్లి తీసుకొచ్చిన సంబంధాలను దివి అబద్దాలు చెప్పి వెనక్కి పంపించేస్తుంటుంది. మరోవైపు దివికి అమెరికా సంబంధం చేయాలని కొడుకు అభిజిత్ స్నేహితుడు అయిన అఖిల్‌ను అమెరికా నుండి పిలిపిస్తుంది కళ్యాణి. అయితే దివికి ఇష్టం లేక… అఖిల్‌తో గొడవ పడుతుంది. దీంతో అఖిల్ కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడు. మరోవైపు దేవీ వచ్చి అఖిల్ అమ్మాయిల పిచ్చోడు అని చాడీలు పెట్టేసి వెళ్లిపోయింది. కారణం ఆమె అఖిల్‌ను ఇష్టపడటం. ఇద్దరి మధ్య వాళ్ల ఊరు గురించి, కుటుంబం గురించి గొడవ వస్తుంది. పల్లెటూరు అంటే నచ్చదు అన్నాడని అఖిల్‌ను పెళ్లి చేసుకోనని దివి చెబుతుంది. అదే సమయంలో దివిని పెళ్లి చేసుకోవడానికి అఖిల్ కూడా ఇష్టపడడు. అయితే అభిజీత్, సుజాత నచ్చజెప్పి ఇద్దరూ పెళ్లికి అంగీకరించేలా చేస్తారు. మీ కోడలు చాలా మంచిది అని… కళ్యాణికి అఖిల్ చెబుతాడు. ఈ క్రమంలో కళ్యాణికి కనువిప్పు కలుగుతుంది. కోడలిని అక్కున చేర్చుకుంటుంది. పనిలోపనిగా మతిమరుపు అకౌంటెంట్‌కి, పని మనిషి దేవీకి పనిలో పనిగా పెళ్లి చేసేసింది కళ్యాణి.
ఎవరెలా చేశారంటే?
తనకు బాగా అలవాటైన పాత్ర కావడంతో కళ్యాణి జీవించేసింది. గయ్యాళి అత్తగా, కూతురిని అమితంగా ప్రేమించే తల్లిగా ఆమె నటన సూపర్బ్. దివి పాత్రకు పెద్దగా నటించే అవకాశం రాలేదు. (ఇవ్వలేదేమో). చేసినంతవరకు బాగానే చేసింది. అత్తతో బాధలు పడినా… బయటకు మా అత్త సూపర్ అనుకునే పాత్రలో సుజాత చక్కగా నటించింది. అత్త గురించి అఖిల్‌తో మంచిగా చెప్పే సందర్భంలో ఆమె అభినయం బాగుంది. తల్లి చాటు బిడ్డగా అభిజీత్ సగటు భర్తగా బాగా కనిపించాడు. అమెరికా నుండి వచ్చిన పెళ్లి కొడుకుగా అఖిల్ తన డిక్షన్‌తో సూపర్ అనిపించాడు. మతిమరుపు అకౌంటెంట్‌గా కుమార్ సాయి హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాల్లో తనకున్న అనుభవాన్ని ఇక్కడ వాడుకున్నాడు. ఇక పనిమనిషిగా దేవీ జీవించేసింది అని చెప్పొచ్చు. ప్రతి సన్నివేశంలో వావ్ అనిపిస్తూనే ఉంది. వార్తలు చదివే దేవీలో ఇంత సీన్ ఉందా? అని అనుకునేలా నటించింది.
మతిమరపు కుమార్ సాయి, పనిమనిషి దేవీ నాగవల్లి మధ్య ట్రాక్‌ను బాగా సిద్ధం చేసుకున్నారు. ‘నువ్వు నేను డింగ్ డింగ్’ సినిమాకి వెళ్దాం అంటూ దేవి- కుమార్ సాయి మంచి ట్రాక్ రన్ చేశారు. కుమార్ సాయిని మోసం చేసి… దేవి 25 వేల రూపాయలు కొట్టేయడం ఏదైతే ఉందో… వావ్ అసలు. అమెరికా నుండి వచ్చిన అఖిల్.. పని మనిషి దేవిని చూసి పెళ్లి కూతురు అనుకునే ట్రాక్ సూపర్ వచ్చింది. సందెట్లో సడేమియాలాగా దేవిని కుమార్ సాయి వాటేసుకునే సన్నివేశం చక్కగా వచ్చింది. అఖిల్ – దివి ప్రైవేటుగా మాట్లాడుకునే సీన్ చక్కగా లైన్ చేశారు. ఇక్కడ ‘పులిహోర’ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ‘నీకు పులిహోర కలపడం రాదా’ అంటూ అఖిల్‌కు దివి వేసిన పంచ్ కూడా బాగుంది.
యాడ్స్ సంగతేంటి?
సీరియల్ మధ్యలో యాడ్స్ వచ్చేలా రెండు టీమ్‌లు సిద్ధం చేసుకున్నాయి. చీపురు యాడ్‌ను గంగవ్వ, నోయల్, హారిక, సోహైల్, అరియానా చింపి ఆరేశారు. ఆఖరులో గంగవ్వ పంచ్‌లు అయితే కేకో కేక. ఆఖరులో చిన్ని చీపురు అంటూ ఓ పాట కూడా పాడేశారు. అమ్మ రాజశేఖర్, మెహబూబ్, లాస్య, మోనాల్ కలసి బట్టతల యాడ్ చేశారు. జుట్టు లేని అమ్మ రాజశేఖర్ విగ్గు పెట్టుకొని మోనాల్‌ను పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. అమ్మాయికి నచ్చాడు అనుకునేలోగా విగ్గు తీసేసి దొరికిపోతాడు. ఆ తర్వాత జట్టు లేదని బాధపడొద్దు. ‘సలోఫా’ విగ్గు ఉంది కదా అంటూ ఓ యాడ్ చేశారు. సీరియల్ అయిపోయాక.. హౌస్ మేట్స్ అందరూ…అమ్మ రాజశేఖర్ ఆధ్వర్యంలో అందరూ సిగ్నేచర్ స్టెప్పులు వేశారు. ‘సలోఫా,’ ‘చిన్ని చీపిరి’ అంటూ ట్రేడ్ మార్క్ స్టెప్పులేశారు. ఫైనల్‌గా అందరూ కలసి అత్త-కోడలు మెసేజ్ ఇచ్చినా బోర్ కొట్టించారు.
రేటింగ్: 3.5/5