బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చేటప్పుడు ఎలా ఆడాలి, ఏం చెయ్యాలి, ఎవరు ఆడాలి అని వివరిస్తూ ఓ డాక్యుమెంట్ పంపిస్తాడు. అవి చదివి చెప్పినట్లు ఆడాలి. కానీ బిగ్‌బాస్ ఆ డాక్యుమెంట్‌ని పిచ్చి కాగితంలా చూస్తున్నారా? ఏమో నెటిజన్ల కామెంట్లు చూస్తుంటే, ఇంట్లో వాళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ‘బిబి గ్రాండ్ హోటల్’ టాస్క్ చూస్తే మీకే అర్థమవుతుంది. సేవలు అందించి, స్టార్స్ పొందండి అంటే గొడవలు పెట్టుకొని సింపథీ పొందుతున్నారు. అసలు బిగ్‌బాస్ టాస్క్ నోట్‌లో ఏం రాశాడో పట్టించుకోవడం లేదు.
బిగ్‌బాస్ చెప్పింది ఇదీ…
బిగ్‌బాస్ ఇల్లు పెద్ద గ్రాండ్ హోటల్‌గా మారబోతోంది. బిగ్‌బాస్ హోటల్ అద్భుతమైన సేవలను అందించించే హోటల్. దీంతోపాటు రెస్టరెంట్, స్పా, ఎంటర్‌టైన్మెంట్ క్లబ్ కూడా ఉన్నాయి. కాకపోతే బిబి గ్రాండ్ హోటల్ క్రూరమైన ధనికుల చేతిలోకి వెళ్లబోతోంది. అలా జరగకుండా ఉండటానికి హోటల్ అతిథులను ఆహ్వానిస్తోంది. ఆ అతిథులను హోటల్ సిబ్బంది తమ పనితనంతో బాగా మెప్పించి, వారి దగ్గర ఉన్న సేవలను అందించి 5 స్టార్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా చేయగలిగితే హోటల్ వారి చేయి నుంచి జారకుండా కాపాడుకోవచ్చు. అతిథులు నిరంతరం సేవలు పొందుతూనే, హోటల్ సిబ్బందికి కష్టతరమైన సవాళ్లు విసురుతూ ఉండాలి. హోటల్ సిబ్బంది… అతిథులు ఇచ్చే స్టార్‌ను పొంది, హోటల్ నుంచి రక్షించే ప్రయత్నం చేయాలి. అతిథులు తమ ఇష్టానుసారం హోటల్ సిబ్బందిలో ఒకరికి సవాలు ఇవ్వొచ్చు. ఒకవేళ సిబ్బంది ఆ సవాలు చేయడానికి నిరాకరిస్తే మేనేజర్ అతని తరఫున ఆ సవాలు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మేనేజర్ ఆ సవాలు చేయకపోతే స్టార్ లభించదు. అతిథుల దగ్గర బిగ్‌బాస్ డబ్బులు ఉంటాయి. అవి టిప్స్‌గా ఇవ్వాలి. అతిథులు తమకు కావాల్సిన ఆహారాన్ని రాత్రి పగలూ ఎప్పుడైనా అడగొచ్చు. అతిథుల కోసం పంపించే ఆహారం కేవలం అతిథులకే పెట్టాలి. సిబ్బంది తినడానికి కుదరదు.
చదివారుగా… ఇప్పుడు చెప్పండి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం నడుస్తున్న ‘బిబి గ్రాండ్ హోటల్’ టాస్క్ ఇలా జరుగుతోందా? కచ్చితంగా కాదనే చెబుతారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది హౌస్‌మేట్స్ ఈ నోట్‌ను ఫాలో అవ్వడం లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు. దీంతో టాస్క్ విషయంలో బిగ్‌బాస్ చెప్పింది వీళ్లకు అర్థం కాలేదా? లేక ఆడాలని లేక ఇలా చేస్తున్నారా అనే డౌట్ కూడా వస్తోంది.
హోటల్‌కు వచ్చినవారు అడిగిన ఫుడ్ ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా ఇవ్వాలి అని బిగ్‌బాస్ చెప్పాడు. కానీ ఇంట్లో చూస్తే కిచెన్ మూసేశాం, గ్యాస్ అయిపోయింది అంటూ రకరకాల కారణాలు చెబుతున్నారు. అతిథులు అడిగిన పని చేయకపోగా, వాళ్ల మీద సెటైర్లు వేస్తున్నారు. తిరిగి టిప్ ఇవ్వలేదంటూ స్ట్రయిక్ చేస్తున్నారు. ఏదైనా ఫుడ్ అడిగితే స్టాఫ్ సెలవులో ఉన్నారని, ఇప్పుడు అవ్వదని సమాధానాలిస్తున్నారు. రెండో రోజు ఉదయం లేచి రెస్టెంట్‌లో ఏమున్నాయి అంటూ మెహబూబ్ అడిగితే.. నిన్న మేం చేసిన పనికి మూడు స్టార్లు ఇవ్వండి అంటూ అభిజీత్ అడిగాడు. గెస్ట్‌ల కోసం వండిన ఫుడ్‌ను మధ్యలో అమ్మ రాజశేఖర్ మాస్టర్ తినడమూ కనిపించింది. ఇది ఏ విధంగా టాస్క్ అనిపించుకుంటుందో వాళ్లకే తెలియాలి.
హోటల్ సిబ్బందికి కష్టమైన సవాలు విసరమని గెస్ట్‌లకు బిగ్‌బాస్ చెప్పాడు. అంటే సేవలు చేసే పనిలో కష్టమైన లేదంటే చేయడానికి ఇబ్బంది పడే టాస్క్‌లు ఇవ్వాలి. కానీ ఇంట్లో చూస్తే పూల్‌లో వందసార్లు దూకు, బరువులు ఎత్తు, పుషప్స్ చెయ్యు, బీన్ బ్యాగ్‌లో ధర్మాకోల్ బాల్స్ లెక్కపెట్టు అంటూ హోటల్ సర్వీసుకు దూరంగా ఉండే పనులు అప్పగిస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది అందించే సేవలు కన్నా… ఈ ఎక్స్‌ట్రా టాస్క్‌లే కనిపిస్తున్నాయి.
ఆఖరున ఒక స్టార్ ఇవ్వడానికి అంగీకరించిన హారిక చేతికి ఐదు స్టార్లు ఇచ్చి మళ్లీ తీసుకున్నాడు అభి. ఇక నాకు మొత్తం ఐదు స్టార్లు ఇచ్చినట్లే అంటూ ఓ లెక్కేసి చెప్పాడు. అది కరెక్ట్ కాదు అని హారిక చెప్పినా… నీ చేతితో ఇచ్చావ్ కాబట్టి మాకు ఐదు స్టార్లు వచ్చినట్లే అని దబాయించే ప్రయత్నం చేశాడు అభిజీత్. కమింగ్ అప్ ప్రోమో చూస్తుంటే ఈ విషయం మీద పెద్ద చర్చే జరగినట్లుంది. మరి బిగ్‌బాస్ ఏమంటాడో చూడాలి.
ఇక సీక్రెట్ టాస్క్ ఆడుతున్న అవినాష్ అయితే తన పని తాను పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నాడు. హోటల్ సిబ్బంది చేస్తున్న సేవలను చెడగొడుతున్నారు. సర్వ్ చేసిన బిరియానీలో తల వెంట్రుక వేసి విసిగించాడు. ఆ తర్వాత వేరే ప్లేట్‌లో హెయిర్ పిన్ కూడా వేశాడు. సోహైల్ బ్లేజర్ ముఖం మీద విసిరి కొట్టి కోపం తెప్పించాడు. చూద్దాం మొత్తం పది పూర్తి చేస్తాడో లేదో.