బిగ్‌బాస్ నాలుగో సీజన్ తొలి ఎలిమినేషన్ ప్రాసెస్‌కు రంగం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు నాగార్జున వచ్చి… ఆ ప్రక్రియ మొదలుపెడతారు. దానికి ముందు ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరు మాట్లాడిన మాటలు, వేసిన వేషాలు అన్నీ బయటపెట్టేస్తారు. కెమెరాకు దొరికినవే చెప్పాం… అంటారు కానీ. కెమెరాకు దొరకనివి ఏముంటాయి అని. ఇక ఈ వారం ఎలిమినేషన్ రేసులో మొత్తంగా ఏడుగురు ఉన్న విషయం తెలిసిందే. మరి వాళ్లలో ఈ వారం ఎవరు సేఫ్ అవుతారో చూద్దామా?
తొలి వారం ఎలిమినేషన్ గేమ్‌లో ముందుగా సేఫ్ అయ్యేది అందరికీ తెలిసినట్లే గంగవ్వ. అసలు ఆమెను ఎలిమినేట్ చేయాలని ఎవరూ అనుకోలేదు. కేవలం ఓట్ల సంఖ్య పెంచుకునే క్రమంలో బిగ్ బాస్ ఆడిన ఆట అది. ఆమె ఎన్ని రోజులు లోపల ఉండగలిగితే అన్ని రోజులూ ఉంచుతారనేది అందరూ ఊహిస్తున్న విషయమే. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ రేసులో ఉన్నది ఆరుగురనే చెప్పాలి. వాళ్లే అభిజిత్, దివి, అఖిల్ సార్ధక్, సూర్య కిరణ్, మెహబూబ్, సుజాత. ఇందులో మొన్నటివరకు ఎలిమినేషన్ పక్కా అనుకున్న పేర్లలో దివి ఒకటి. మొత్తం ఎపిసోడ్‌లో పది సెకన్ల స్క్రీన్ స్పేస్ కూడా ఆమెకు ఇవ్వలేదు. అంతగా ఫర్నిచర్‌లో కలసిపోయింది. అయితే దివి ఒక్క ఎపిసోడ్‌తోనే స్టార్ అయిపోయింది.
మొన్న ‘ఓపెన్ హార్ట్ విత్ దివి’ కార్యక్రమంలో ఆమె ఇంటి సభ్యుల గురించి చెప్పిన మాటలు, అమె అభిప్రాయాలు ప్రజలకు బాగా నచ్చేశాయి. ‘మా దివి మాట్లాడిందోచ్’ అంటూ నెటిజన్ల తెగ సందడి చేశారు. ఆ రెండో రోజు అంటే నిన్న అమ్మ రాజశేఖర్ – దివి మధ్య జరిగిన పులిహోర కాన్సెప్ట్ కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో ఆమె ఓట్ల గ్రాఫ్ పెరిగిందని చెప్పొచ్చు. గంగవ్వ తర్వాత హౌస్‌లో ఎలాంటి బ్లాక్ స్పాట్ లేని మనిషి అభిజిత్. తనపని తాను చేసుకుంటూ, అందరితో కలసిపోయి గేమ్ అడుతున్నాడు. కాబట్టి ఈ వారం అభిజిత్ కూడా సేఫ్.
మామూలుగా అయితే అఖిల్ ఈ వారం ఎలిమినేట్ ఫైనల్ లిస్ట్‌లో ఉండేవాడే. అయితే ‘కట్టప్ప ఎవరు?’ టాస్క్‌లో అఖిల్ పేరు అందరి నోళ్లలో నానింది. దీంతో నెటిజన్లుకు అంతగా టచ్‌లో లేని అఖిల్ కూడా ఈసారి మంచి ఓట్లే సంపాదించాడు. ఇక మిగిలింది ముగ్గురు. మెహబూబ్, సూర్యకిరణ్, సుజాత. ఇందులో సూర్యకిరణ్ అంటే ఇంట్లో ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. అందరిమీద అజమాయిషీ చలాయించాలని చూడటం, ఏ ఇద్దరు మాట్లాడుతున్నా మధ్యలోకి వెళ్లి తను చెప్పించే చేయాలి అనడం లాంటివి సూర్యకిరణ్‌ను ఇంట్లో బ్యాడ్ చేశాయి. కాబట్టి ఈ సారి సూర్యకిరణ్ డేంజర్‌లో ఉన్నట్లే. మెహబూబ్, సుజాత ఉన్నారు కానీ… ఎక్కడా వాళ్లకు సోలో స్క్రీన్ స్పేస్ దక్కలేదు. అంటే వాళ్ల పర్‌ఫార్మెన్స్ అంత అట్రాక్టివ్‌గా లేదనే చెప్పాలి. ఆఖరి దివి అభిప్రాయాలు చెప్పినప్పుడు మెహబూబ్ గురించి టెలీకాస్ట్ చేయలేదు. సుజాత పరిస్థితీ ఇంతే. ఇంకా ఆమె ఇంట్లో అంతగా సెట్ అవ్వలేదు.
ఈ ముగ్గురూ ఎలిమినేషన్ టాప్ 3లో ఉండొచ్చు. వీళ్ల ఓటింగ్ శాతం కూడా తక్కువగానే ఉందని అంటున్నారు. ఆఖరి రోజున వీళ్లకు పడిన ఓట్ల బట్టి ఫలితంలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఇంట్లో గొడవలు, ఎమోషన్స్, డ్రామా కావాలంటే… సూర్యకిరణ్‌ను ఇంకా కొనసాగిస్తారు. లేదు ఓట్ల శాతమే పక్కా అనుకుంటే అతను బయటకు వెళ్లిపోవచ్చు. సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ వారం మెహబూబ్ బయటకు వెళ్లే అవకాశమూ తక్కువే. లేదంటే సుజాతను పంపించే అవకాశం ఉంది. ఈ రోజు ఎలాగూ ఎలిమినేట్ అయ్యేదెవరో చెప్పరు కాబట్టి… ఆదివారం చూసేద్దాం ఎవరు బయటికెళ్తారో.