#BiggBossTelugu Season 5: అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రొమో వచ్చేసింది!

టెలివిజన్‌ చరిత్రలోనే అత్యధికంగా వీక్షించిన రియాల్టీ షోలలో ఒకటిగా ఖచ్చితంగా నిలిచే షో లలో స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ తెలుగు ముందు వరుసలో ఉంటుంది. గత సంవత్సరం 15 వారాల పాటు జరిగిన సీజన్‌, తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటినీ చేరువయింది. బిగ్‌బాస్‌ సీజన్‌ ముగిసిన వెంటనే తరువాత సీజన్‌ ఎప్పుడు ఆరంభమవుతుందోనంటూ ఆసక్తిగా ఎదురుచూస్తూ, చర్చలు చేస్తోన్న అభిమానులూ ఎంతో మంది ఉన్నారు. ఈ నిరీక్షణకు తెరదించుతూ బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ప్రొమోను విడుదల చేసింది స్టార్‌మా. షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోననే ఎదురుచూపులు… ఈసారి ఎవరు హౌస్‌లో ఉండబోతున్నారనే చర్చలు… చేస్తున్న నయా విశ్లేషకులలో ఆసక్తిని రేపుతూ పూర్తి చమత్కారంగా ఈ ప్రొమో తీర్చిదిద్దారు.

 

మొట్టమొదటిసారిగా ఓ మ్యూజిక్‌ వీడియో రూపంలో విడుదల చేసిన ఈ ప్రొమోలో సూపర్‌స్టార్‌ నాగార్జున, వినోదమనే బుల్లెట్‌లను నింపిన గన్‌తో ‘విసుగు’ను చంపే సెక్సీ, సరసపు కిల్లర్‌గా కనిపించనున్నారు. మిస్టర్‌ విసుగు, బిగ్‌బాస్‌ నడుమ జరిగిన ముఖాముఖిలో ఈ విసుగును నాగార్జున తన వినోదపు బుల్లెట్‌తో చంపడంతో ప్రతి ఒక్కరూ ఆనంద కేళిలో మునిగిపోతారు.

ఈసారి బిగ్‌బాస్‌ షో యాక్షన్‌, డ్రామా, రొమాన్స్‌, వినోదం, ఆహ్లాదం సమ్మేళనంగా ఉండటమే కాదు గత సీజన్‌లతో పోలిస్తే మరింత పెద్దగా, ఉత్తమంగా ఉంటుందనే వాగ్ధానమూ చేస్తుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రొమోకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం చేయగా, ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా జె యువరాజ్‌ చేశారు. ఈ ప్రొమోకు సంగీతాన్ని యశ్వంత్‌ నాగ్‌ అందిస్తే, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాటను ఆలపించారు.

కొద్ది రోజుల క్రితమే బిగ్‌బాస్‌ లోగో విడుదలైంది. దారి తెలియని ఓ చిట్టడవి నుంచి బయటకు రావడానికి ఎలాగైతే యుక్తిని ప్రదర్శించాలో అదే రీతిలో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి విజేతగా బయటకు రావడానికి చూపాల్సిన యుక్తిని గుర్తుకు తెచ్చే రీతిలో ఈ లోగో రూపుదిద్దుకుంది. ఇక, అద్భుతపు ఆస్వాదనకు సిద్ధమవుదామా ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus