బర్త్‌డే స్పెషల్‌: సినిమాల్లో చెబుతూనే చేస్తున్న చిరంజీవి

  • August 22, 2021 / 11:08 PM IST

సందేశం ఇవ్వడం వేరు… సందేశంలా ఉండడం వేరు. తొలి పని చాలా సులభం.. మైక్‌లో ఊదరగొట్టొచ్చు, వార్తల్లోకి ఎక్కొచ్చు. అదే జీవితాన్నే సందేశంలా మలచుకోవడం అంటే అంత సులభం కాదు. ఆ రెండో రకం వ్యక్తే ఈ రోజు బర్త్‌డే బాయ్‌ 66 ఏళ్ల నవ యవ్వనుడు మెగాస్టార్‌ చిరంజీవి. ఈపాటికే అభిమానులు అందరూ ‘హ్యాపీ బర్త్‌డే చిరు’ అంటూ ప్రేమతో స్టేటస్‌లు, పోస్ట్‌లు, ట్వీట్లు పెట్టేసుంటారు. సగటు ప్రేక్షకులు, నెటిజన్లు వాటిని చూసి ఉంటారు. అయితే హీరోల్లో చిరంజీవి ఎందుకు స్పెషల్‌…ఒకసారి చూద్దాం! అంతేకాదు హెడ్డింగ్‌లో వినోదం+సందేశం= చిరంజీవి అని ఎందుకన్నామో కూడా చూద్దాం!

చిరంజీవి గురించి మొత్తం చెప్పడానికి ఈ రోజు సరిపోదు… అందుకే అతని జీవితంలో ‘సందేశం’ పాళ్లు ఎంతో చూద్దాం. జీవితం అంటే కేవలం రీల్‌ లైఫ్‌ మాత్రమే కాదు, రియల్‌ లైఫ్‌ కూడా. అలా అని మరీ ఎమోషనల్‌గా చెప్పాలనుకోవడం లేదు కూడా. ఏదో సరదాగా రీసెంట్‌గా జరిగిన అంశాలతో చిరంజీవి గురించి చిన్నగా డిస్కస్‌ చేసుకుందాం. ముందుగా రీల్‌ లైఫ్‌తో మొదలుపెడదాం. ఆ తర్వాత రియల్‌ లైఫ్‌లోకి వద్దాం.

చిరంజీవి సినిమాల్లో మనం గమనిస్తే… వినోదం పుష్కలంగా ఉంటుంది. మాస్‌ మసాలా మూమెంట్స్‌, డ్యాన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయి. అయితే చిరంజీవి అంటే వినోదం అని ఎక్కువమంది అనుకుంటున్నారు. అంతగా అలరిస్తారాయన. అయితే ఆయన ఎలాంటి సినిమా చేసినా… అంతర్లీనంగా సమాజానికి పనికొచ్చే అంశాలను ఎక్కడో దగ్గర స్ఫృశిస్తూనే ఉంటారు. ఒక్కోసారి అయితే సినిమా అంతే అలాంటి సోషల్‌ కాజ్‌ కనిపిస్తుంది. ఆయన రీసెంట్‌ సినిమాల్లో కొన్ని తీసుకుంటే మనకు ఈ విషయం పక్కాగా తెలిసిపోతుంది.

రాజకీయాల్లోకి వెళ్లి వచ్చిన తర్వాత చిరంజీవి చేసిన సినిమాలే చూద్దాం… ‘ఖైదీ నెం 150’లో రైతుల కష్టాలు చూపించారు. ‘సైరా’గురించి ప్రత్యేకంగా చెప్పాలా… చరిత్రలోని తొలి స్వాతంత్ర్య సమరయోదుడిగా కనిపించి స్వాతంత్ర్య కాంక్ష రగిలిన విధానం కళ్లకు కట్టారు. ‘ఆచార్య’లో దేవాదాయ శాఖ సమస్యల్ని స్ఫృళిస్తున్నారని భోగట్టా. ఇక ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో లేటెస్ట్‌వి చూస్తే… ‘శంకర్‌దాదా..’ సిరీస్‌లో గాంధీతత్వం గురించి వివరించారు. ‘స్టాలిన్‌’లో సాయం గొప్పతనం చూపించారు. ‘ఠాగూర్‌’లో అవినీతి భూతం… జనాల్ని ఎలా పట్టిపీడిస్తోందో చూపించారు. రాయలసీమ నేపథ్య సినిమాలంటే రెండు కుటుంబాల గొడవలు కాదు… ఓ ప్రాంతం సమస్య అని ‘ఇంద్ర’ వివరిస్తాడు. ఇలా చిరంజీవి సినిమాల్లో వినోదం కనిపిస్తూనే, సందేశం కూడా ఉంటుంది.

ఇక రియల్‌ లైఫ్‌ గురించి చెప్పాలంటే… ఆయన చేసిన బహిరంగ దానాలు మాత్రమే మనకు తెలుసు. గుప్తదానాల లెక్కల అందుకున్నవాళ్లే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో రక్తం కోసం అవసరార్థులు బాగా ఇబ్బందిపడుతున్న సమయంలో బ్లడ్‌బ్యాంక్‌తో ముందుకొచ్చాడు. నేత్రదానం గురించి ఏకంగా ఐ బ్యాంక్‌ పెట్టాడు. చాలా ఏళ్లుగా ఈ రెండూ దిగ్విజయంగా నడుస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రజల కోసం. ఇక సినిమాల వాళ్ల కోసం అయితే కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసి తనవంతుగా వాళ్లకు అవసరమైన సాయం చేస్తూ వచ్చారు.

తనను నమ్ముకున్నవారికి, తెలిసినవారికి, తెలియనివారికి… ఇలా ఎవరికైనా కష్టం ఉందంటే ‘నేనున్నా’అంటూ ముందుకొస్తారు చిరంజీవి. మొన్నామధ్య పొన్నాంబళం శస్త్రచికిత్సకు డబ్బులు సాయం చేశారు. ఇది ఆయన చేసిన సాయాల్లో ఒకటి మాత్రమే. ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో. ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేగా… ఇంకెందుకు మీ కోసమే. అవును ఆ విధంగా అయినా ప్రజల్లో సేవాతత్పరత, దాన గుణం పెరుగుతుందని చిరు ఆశ. సినిమాల్లో సందేశం ఇచ్చి… మీరు చేయండి అంటే ఏం బాగుంటుంది… చేసి చూపిస్తేనే కదా బాగా జనాల్లోకి వెళ్లేది సందేశం. ఇదీ చిరంజీవి అంటే!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus