తమిళ నటి నివేతా పేతురాజ్ టైటిల్ పాత్రలో చందు మొండేటి దర్శకత్వంలో వెబ్ ఫిలింగా తెరకెక్కిన చిత్రం “బ్లడీ మేరీ”. డార్క్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. ప్రతి శుక్రవారం ఆహా అందించే ఎంటర్ టైన్మెంట్ ను బ్లడీ మేరీ కంటిన్యూ చేసిందా లేదా అనేది చూద్దాం..!!
కథ: ఓ అనాధ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి మేరీ (నివేతా పేతురాజ్). కళ్ళు సరిగా కనబడకపోయినా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడంలో ఆమె దిట్ట. ఆమె స్నేహితులు (కిరీటి, రాజ్ కుమార్)లతో కలిసి జీవిస్తుంటుంది. ఒకడేమో మూగోడు, ఇంకోడేమో చెవిటోడు. ఇలా ముగ్గురు అంగవైకల్యం ఉన్న వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రతికేస్తుంటారు. అనుకోని విధంగా ఎస్సై (అజయ్) దగ్గర ఇరుక్కుంటారు ఈ ముగ్గురు స్నేహితులు.
అది కూడా రెండు మర్డర్ కేసుల్లో. నిజానికి ఆ మర్డర్లకి ఈ ముగ్గురికి ఎలాంటి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు. ఈ హత్య కేసుల నుండి, ఎస్సై నుండి, లోకల్ గుండా (బ్రహ్మాజీ) నుండి మేరీ & ఫ్రెండ్స్ ఎలా తప్పించుకున్నారు? అనేది సినిమా కథాంశం.
నటీనటు పనితీరు : ఇప్పటివరకూ నివేతా ప్లే చేయని ఓ డిఫరెంట్ & పవర్ ఫుల్ రోల్ మేరీ. పాత్రకు ఆమె 100% న్యాయం చేసింది. కళ్ళు సరిగా కనిపించకపోవడం అనేది పూర్తిస్థాయిలో ఎలివేట్ అవ్వకపోయినా.. క్యారెక్టరైజేషన్ ను మాత్రం చక్కగా ఓన్ చేసుకుని ఆకట్టుకుంది. మూగవాడిగా కిరీటి, చెవుటివాడిగా రాజ్ కుమార్ లు పర్వాలేదనిపించుకున్నారు. విలన్లుగా అజయ్ & బ్రహ్మాజీ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.
వీళ్ళందరిలో ఎక్కువ మార్కులు కొట్టేసిన నటుడు మాత్రం అజయ్ అనే చెప్పాలి. తన సీనియారిటీతో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను అద్భుతంగా పోషించాడు. అలాగే.. హేమంత్ నవ్వించడానికి ప్రయత్నించాడు.
సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ఒక డిఫరెంట్ జోన్ లోకి ఆడియన్స్ ను తీసుకెళ్ళాడు కార్తీక్. కలర్ గ్రేడియంట్, లైటింగ్ విషయంలో కార్తీక్ ఎప్పుడూ కొత్తదనం ఆపాదిస్తుంటాడు. బ్లడీ మేరీతోనూ అది కంటిన్యూ చేశాడు. అందువల్ల ఒకానొక దశలో ఏం జరగబోతోంది అనేది అర్ధమైపోయినా.. టెక్నికల్ గా ఆడియన్స్ ను ఎంగేజ్ చేసి ఉంచేశాడు కార్తీక్. అలాగే.. కాలభైరవ నేపధ్య సంగీతం కూడా బాగుంది. కంటెంట్ & కంటెక్స్ట్ కు కావాల్సిన ఎమోషన్ ను యాడ్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ 15 నిమిషాల ప్రొడక్షన్ డిజైన్ మంచి కిక్ ఇస్తుంది.
దర్శకుడు చందు మొండేటి తన రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా బ్లడీ మేరీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటివరకూ చందు తీసిన కార్తికేయ, సవ్యసాచిలు థ్రిల్లర్ చిత్రాలే అయినప్పటికీ.. బ్లడీ మేరీ విషయంలో క్యారెక్టర్ బేస్డ్ థీమ్ తో సినిమాను నడిపించిన విధానం బాగుంది. అయితే.. నటిగా నివేతాను వినియోగించుకున్నంత స్థాయిలో మేరీ క్యారెక్టర్ ను ఎక్స్ ప్లోర్ చేయలేదు చందు.
భీభత్సమైన ఎలివేషన్ కు మాత్రమే కాదు భారీ ఎమోషన్ కు కూడా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఆమెది. ఆమె ఎదుగుదలను ఇంకాస్త ఎక్కువ మాంటేజస్ తో చూపిస్తే ఆడియన్ కనెక్టివిటీ ఇంకాస్త బాగుండేది. అయినప్పటికీ.. ఆడియన్స్ కు ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడంలో చందు విజయం సాధించాడనే చెప్పాలి.
విశ్లేషణ: ఒక మంచి డార్క్ థ్రిల్లర్ “బ్లడీ మేరీ”. ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ ఫిలిమ్ ను టైమ్ పాస్ కోసం మాత్రమే కాదు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం కచ్చితంగా చూడవచ్చు. నివేతా నటన, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, కాలభైరవ సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్.
రేటింగ్ : 3.5/5