కోలీవుడ్ లో టాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ సింహా. తెలుగు వాడే అయినప్పటికీ.. తమిళంలో బాగా పాపులర్ అయ్యారు. తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అతడి పాత్ర ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమైంది. అయినప్పటికీ ఉన్నంతలో బాగానే మెప్పించారు. చాలా రోజులుగా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు బాబీ సింహా. ఈ క్రమంలో ‘వసంత కోకిల’ అనే సినిమాలో నటించారు.
సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా మీద సరైన బజ్ లేదు. చిరంజీవి స్వయంగా ట్రైలర్ రిలీజ్ చేసినా.. ఈ సినిమా ఆడియన్స్ దృష్టిలో పడలేదు. ఈ సినిమా ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఉద్యోగ జీవితంలో విసుగుపోయిన ఓ వ్యక్తి తన ప్రియురాలిని తీసుకుని ఏకాంతంగా ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తాడు. అలా అనుకోకుండా ప్రయాణం మధ్యలో ఓ అడవిలో వసంత కోకిల అనే హోటల్ లో ఆగాల్సి వస్తుంది. అక్కడ ఈ జంటకు అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి.
ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. దర్శకుడు రమణన్ పురుషోత్తమ నేరేషన్ ఆశించిన స్థాయిలో లేదు. చాలా వరకు కన్ఫ్యుజింగ్ గా సాగింది. సినిమాలో సరైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా లేవు. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే డిజైన్ చేసుకున్నప్పటికీ.. దాని ముందు వెనుకా నడిపించాల్సిన కంటెంట్ బలంగా లేకపోవడంతో ఆడియన్స్ కి సినిమాపై చికాకు వస్తుంది.
సినిమా ఆర్య స్పెషల్ క్యామియో ఎట్రాక్ట్ చేయలేకపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కెరీర్ లో దూసుకుపోతున్న బాబీ సింహా.. హీరోగా సినిమా చేయాలనుకోవడం రిస్క్ అనే చెప్పాలి. అలా ప్రయత్నించినప్పుడు సరైన కథను ఎన్నుకొని ఉండాల్సింది. కానీ వసంత కోకిల లాంటి స్టోరీతో హీరోగా నిలబడాలనుకున్న ఆయన కోరిక మాత్రం నెరవేరేలా లేదు.