భాషతో సంబంధం లేకుండా కాస్టింగ్ కౌచ్ అనే అంశం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. రోజుకో నటి సినీ పరిశ్రమలో తనకెదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి మహి గిల్ సంచలన కామెంట్స్ చేశారు. చండీగర్ లో పుట్టి పెరిగిన ఈమె మొదట పంజాబీలో నటిగా పరిచయమయ్యారు. 2009లో దేవ్ డీ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. పాతిక సినిమాలు చేసిన ఈ సుందరి తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు బయటపెట్టారు. “సినీ అవకాశాల కోసం ముంబై వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు మంచి వాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ముంబైలోని సినీ పరిశ్రమలో ఉన్న మాటలు వినాల్సి వచ్చేది. మంచి వ్యక్తులను ఎవరని గుర్తించడం..
అలాంటి వారిని కలవడం చాలా కష్టమయ్యేది” అని వివరించారు. ఇక దర్శకనిర్మాతల గురించి ప్రస్తావిస్తూ.. “పడక గదికి వస్తేనే వేషాలు ఇస్తామని చాలా మంది నా కెరీర్ తొలినాళ్లలో వేధించారు. చాలా సార్లు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. చాలా మంది డైరెక్టర్ల పేర్లు కూడా గుర్తుకు లేవు. పరిశ్రమలో ఎక్కువ మంది ఇడియెట్స్ ఉంటారు” అని మహి ఆరోపించారు. “ఓ సారి నేను ఓ డైరెక్టర్‌ను కలిశాను. అప్పుడు నేను సల్వార్ సూట్ వెళ్లాను. అందుకు నీవు ఇలా సల్వార్ సూట్‌లో వస్తే ఎవరూ వేషాలు ఇవ్వరు అని అన్నాడు. మరో డైరెక్టర్ “నిన్ను నైటీలో చూడాలనుకొంటున్నాను” అని అన్నాడు” అని మహి గిల్ తెలిపారు. ఈమె మాటలు బాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి.