“పుష్ప 2” (Pushpa 2: The Rule) సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిందన్న సంతోషంతో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీసాయి. “ముంబైకి నిద్రపట్టి ఉండదు” అని బోనీ కపూర్ పక్కన కూర్చొని చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ దర్శకులు సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా, సిద్దార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ గుప్తా సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ..
“సీనియర్ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) పక్కన కూర్చొని అహంకారంగా మాట్లాడటం సరికాదు. ఈ తరహా అసభ్యకరమైన యాటిట్యూడ్ తెలుగు పరిశ్రమ సీనియర్ నిర్మాతల నుంచి ఎప్పుడూ ఆశించలేం,” అంటూ ఆయన విమర్శించారు. అదే సమయంలో “తెలుగు సినిమాల్లో 1500కి పైగా విడుదలల్లో ఆరు మాత్రమే బ్లాక్ బస్టర్స్. బాలీవుడ్‌ను టేకోవర్ చేసినట్లు చెప్పుకోవడం ఒక హాస్యాస్పదం” అని ప్రశ్నించారు. ‘స్కామ్ 1992’ దర్శకుడు హన్సల్ మెహతా (Hansal Mehta) కూడా నాగవంశీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
“మీ వ్యాఖ్యలు మాకు ప్రాధాన్యం ఇవ్వవు. ముంబై ఎప్పుడూ నిద్రపోని నగరం, మీ వర్ణనకు అతీతం,” అని హన్సల్ వ్యాఖ్యానించారు. అంతేకాక, “టాలీవుడ్‌లో విజయవంతమైన కథలను బాలీవుడ్‌లోకి తీసుకురావడంపై మేము ఎప్పుడూ సంతోషించాం. కానీ అహంకారంతో మాట్లాడటానికి మాత్రం మీకెవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు. పఠాన్, వార్ 2 డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) కూడా ఈ వివాదంపై నాగవంశీ వ్యాఖ్యలను ఖండించారు. “ముంబై నగరానికి సంబంధించిన రియాలిటీ మీకు తెలియదని స్పష్టంగా చెప్పగలను.
ఆత్మన్యూనతా భావం చూపించే ప్రయత్నం చేయడం అవసరం లేదు,” అని తేల్చి చెప్పారు. నాగవంశీ మాత్రం తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ, “బోనీ కపూర్ గారిని గౌరవించకుండా మాట్లాడానని భావించడం తప్పు. ఇది ఓ ఫన్ మీటింగ్ మాత్రమే, ఆ తర్వాత మేము సంతోషంగా విడిపోతే ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అంటూ వివరణ ఇచ్చారు. ఈ వివాదం టాలీవుడ్ బాలీవుడ్ మధ్య కొత్తగా చర్చకు దారితీసింది.
టాలీవుడ్ అభిమానులు తమ నిర్మాత పట్ల మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. “తెలుగు సినిమాల విజయాన్ని చూసి నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారే ఈ కౌంటర్‌ల వెనుక ఉన్నారు,” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నాగవంశీ కామెంట్స్ బాలీవుడ్ లో అలజడిని సృష్టించయనే మీమ్స్ వైరల్ అవుతున్నాయి.