సోషల్ మీడియాలో ఒకసారి ఏదైనా మీమ్ వైరల్ అయితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. రీసెంట్ గా ‘అఖండ 2’ ప్రమోషన్స్ టైమ్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను హిందీ స్పీచ్ నెట్టింట ఎంత రచ్చ చేసిందో మనందరికీ తెలిసిందే. “హమ్ నే బోల్ దియా.. కాషన్ కియా” అంటూ ఆయన మాట్లాడిన తీరుపై మీమర్స్ పండగ చేసుకున్నారు. ఎక్కడ చూసినా ఈ డైలాగ్ మీదే రీల్స్, స్పూఫ్ లు దర్శనమిచ్చాయి. అయితే ఈ ట్రోలింగ్ ను బోయపాటి తీసుకున్న విధానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా తమ బాడీ లాంగ్వేజ్ మీదో, మాట తీరు మీదో జోకులు పేలితే సెలబ్రిటీలు హర్ట్ అవుతారు లేదా సీరియస్ అవుతారు. కానీ బోయపాటి మాత్రం ఈ విషయంలో చాలా స్పోర్టివ్ గా రియాక్ట్ అయ్యారు. రీసెంట్ గా సింగర్ సునీతతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఆమె స్వయంగా ఆ వైరల్ మీమ్ ను ప్లే చేసి చూపించారు. అది చూసి బోయపాటి కోప్పడకపోగా, పగలబడి నవ్వడం విశేషం.
ఆయన దీనికి ఇచ్చిన వివరణ కూడా చాలా కూల్ గా ఉంది. “నాకు వచ్చిన హిందీ నేను మాట్లాడాను. అందులో నేనేమీ బూతులు తిట్టలేదు కదా” అంటూ చాలా సింపుల్ గా కొట్టిపారేశారు. భాష రాకపోయినా, సినిమాను రీచ్ చేయడానికి చేసిన ప్రయత్నమే తప్ప, అందులో తప్పులేదని ఆయన ఉద్దేశం. పైగా ఈ ట్రోల్స్ ను ఆయన నెగిటివ్ గా కాకుండా, సినిమాకు జరిగిన ఫ్రీ పబ్లిసిటీగా చూడటం ఆయన మెచ్యూరిటీని చూపిస్తోంది. జనం తన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నట్టే అనే లాజిక్ ను బోయపాటి బాగా పట్టుకున్నారు.
అందుకే ఆ మీమ్స్ ఎంత వైరల్ అయితే సినిమాకు అంత మైలేజ్ వస్తుందని భావించారు. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా జత కలిశారు. న్యూ ఇయర్ కు ఈ డైలాగ్ తో ఒక స్పెషల్ డీజే రీమిక్స్ కూడా చేస్తానేమో అంటూ జోకులు పేల్చడం అక్కడ వాతావరణాన్ని ఇంకాస్త లైట్ చేసింది. నిజానికి పాన్ ఇండియా ప్రమోషన్స్ అంటే ఆ మాత్రం హడావిడి, చిన్నపాటి ఎడపా దడపా మాటలు కామనే. కానీ దాన్ని కూడా తన అడ్వాంటేజ్ గా మార్చుకోవడం బోయపాటికే చెల్లింది. భాష మీద పట్టు లేకపోయినా, ముంబై వెళ్లి మైక్ పట్టుకుని మాట్లాడటానికి గట్స్ కావాలి.
