బ్రహ్మానందం (Brahmanandam) ఓ సినిమా చేశారు అంటే.. ఒకప్పుడు నవ్వించడానికి మళ్లీ బ్రహ్మీ వచ్చారు అనేవారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాల ఎంపిక విషయంలో కేవలం నవ్వులు మాత్రమే కాదు.. అంతకుమించి ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. అందుకే ఆయన నుండి వస్తున్న సినిమాల సంఖ్య తగ్గింది.. అలాగే ఆయన చేస్తున్న పాత్రల నిడివి కూడా తగ్గుతోంది. ఏదో బాగా పాత్ర నచ్చితేనో, లేక ఎక్కువగా అడిగితేనో ఆ పాత్రలు చేయడానికి ఆయన సిద్ధమవుతుండటమే కారణం.
అలాంటి బ్రహ్మానందం (Brahmanandam) ఓ ఐదేళ్ల క్రితం ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సినిమా చాలాసార్లు ఆగీ, ఆగీ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా బ్రహ్మానందం మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఆ సినిమానే ‘ఉత్సవం’ (Utsavam). నాటక రంగం గొప్పతనం తెలియజేసేలా దర్శకుడు అర్జున్ సాయి (Arjun Sai) తెరకెక్కించిన చిత్రమిది. దిలీప్ ప్రకాశ్ (Dilip Prakash), రెజీనా (Regina Cassandra) , బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 13న ‘ఉత్సవం’ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి బ్రహ్మానందం, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. దర్శకుడు తల్లీదండ్రులు ఆయనకు అర్జున్ సాయి అని పొరపాటున పేరు పెట్టారు. పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాల్సింది అని అన్నారు. ఎందుకంటే నా బాల్యంలో ఈ సినిమాను ప్రారంభించాడు అని సరదగా అన్నారు బ్రహ్మానందం.
అసలు ఏమైందంటే.. ఐదేళ్ల క్రితం ఈ సినిమా మొదలైంది. కొవిడ్ తదితర అవరోధాలను అధిగమించి సినిమాని పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అందులో బ్రహ్మానందం సరదాగా అలా అన్నారు. ప్రకాశ్ రాజ్ (Prakash Raj) , నాజర్(Nassar) , రాజేంద్ర ప్రసాద్ ( Rajendra Prasad) లాంటి గొప్ప నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. అంతమందితో సినిమాను తెరకెక్కించాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను అని చెప్పారు బ్రహ్మీ.
ఇక ఈ సినిమాలో తాను దుర్యోధనుడి డైలాగ్ చెప్పానని, ఈ సందర్భంగా సురభి నాటక మండలికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. బాబ్జీ అనే వ్యక్తి ఇన్నేళ్లుగా దుర్యోధనుడి పాత్రకు కోసం ధరించిన ఆభరణాలను తాను ఈ సినిమాలో ధరించానని, అందుకు ఆనందిస్తున్నా, గర్వపడుతున్నాను అని చెప్పారు. కనుమరగవుతున్న నాటక రంగాన్ని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో నటించా అని బ్రహ్మానందం (Brahmanandam) ప్రసంగం ముగించారు.