పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని, శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మానందం.. స్పీచ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ” పవన్ కళ్యాణ్ మానవత్వం పరిమళించే మంచి మనిషి. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అని తపిస్తూ ఉంటారు.
అందుకోసం తన బాటలోనే నడిచాడు. ఎవరో వేసుకున్న బాటలో నడవలేదు. ఆయన ఓ స్వయం శిల్పి. దేవుడు ఎవరిని ఎలా షేప్ చేస్తాడు అనేది ఎవరూ ఊహించలేరు. ఈయన సినిమా యాక్టర్ ఏంటీ.. ఎవరితోనూ మాట్లాడడు అనుకుంటారు కానీ డెస్టినీ ఆయన్ని హీరోని చేసింది. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఈయన మినిస్టరా? ఈయన డిప్యూటీ సీఎం ఏంటి? అనుకుంటే.. డెస్టినీ ఆయన్ని డిప్యూటీ సీఎంని చేసింది. పట్టుదల ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిలువెత్తు నిదర్శనం.పవన్ ఇంకా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలి.
‘నేను చాలా సార్లు చెప్పాను. మనకెందుకయ్యా… ఈ రాజకీయాలు’ అని అన్నాను. కానీ డెస్టినీ ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టి సమాధానం ఇచ్చింది. భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలు ఆరోహించవచ్చు. ఆయన్ని ఇంకా పెద్ద స్థాయిలో నిలబెట్టవచ్చు. పవన్ కళ్యాణ్ కి నాకు ఉన్నది స్నేహం కాదు. ఆత్మీయత. ‘హరిహర వీరమల్లు’ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.