బ్రీత్ ఇన్ టు ది షాడోస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ “బ్రీత్”. బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తపన, చేసే రిస్క్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో వచ్చిన మరో సిరీస్ “బ్రీత్ ఇన్ టు ది షాడోస్”. అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్, అమిత్ సాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ జూలై 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: సైక్రియార్టిస్ట్ అవినాష్ (అభిషేక్ బచ్చన్), చెఫ్ అభా (నిత్యామీనన్)ల కుమార్తె సియా సరిగ్గా ఆమె పుట్టినరోజున కనిపించకుండాపోతుంది. ఆమెను ఎవరు ఎత్తుకెళ్లారు, కారణం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. 9 నెలలు దాటినా పాప గురించి ఎలాంటి డీటెయిల్స్ తెలియకపోవడంతో అవినాష్ తన కుమార్తె ఇక లేదని భావించి తన పని తాను చేసుకుంటూపోతుంటాడు. ఒకరోజు సడన్ గా సియా బ్రతికి ఉన్నట్లుగా ఆధారం మరియు ఆమె ఇంటికి రావాలంటే ఒక వ్యక్తిని చంపాల్సి ఉంటుందనే వీడియోను అవినాష్ ఇంటికి కొరియర్ చేస్తాడు కిడ్నాపర్. అలా కూతురు కోసం అవినాష్ & అభా కలిసి మూడు హత్యలు చేస్తారు. అయినా కూతురు ఇంటికి రాదు.

అసలు సియాను కిడ్నాప్ చేసింది ఎవరు? అవినాష్&అభా ల చేత ఆ మర్దర్స్ ఎందుకు చేయిస్తున్నాడు? అందుకు కారణం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు: “గురు, సర్కార్” లాంటి సినిమాల్లో అభిషేక్ బచ్చన్ సబ్టల్ పెర్ఫార్మెన్స్ చూసినవాళ్లందరికీ ఆయన ఎందుకు సక్సెస్ ఫుల్ హీరో అవ్వలేకపోయాడు అనే ప్రశ్న మనసులో తొలిచేస్తూ ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం ఈ సిరీస్ చూస్తే దొరికేస్తుంది. అభిషేక్ మరీ ఇంత పేలవమైన నటుడా అనిపిస్తుంది ఈ సిరీస్ చూస్తుంటే. ముఖ్యంగా రెండు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లో ఏమాత్రం తేడా చూపించలేకపోయాడు. హావభావాలు పలికించలేకపోయాడు సరే కనీసం బాడీ లాంగ్వేజ్ లో అయినా కాస్త వైవిధ్యం చూపిస్తే బాగుండేది. ఏదో మూతి ముడవడం తప్ప పెద్దగా హోమ్ వర్క్ కూడా చేయలేదు మనోడు. సిరీస్ కి చాలా కీలకమైన పాత్రే పేలవంగా ఉండడంతో జనాలకు చూడాలన్న ఎగ్జైట్ మెంట్ ఎపిసోడ్ ఎపిసోడ్ కి తగ్గిపోతుంటుంది.

నిత్యామీనన్ అర్జెంట్ గా సన్నబడాల్సిన అవసరం ఎంత ఉందో ఈ సిరీస్ చూస్తే అర్ధమవుతుంది. సహజ నటి అయిన నిత్యామీనన్ ఈ సిరీస్ లో ఆకట్టుకొనే స్థాయి నట ప్రదర్శన కనబరచలేదు. పైగా మరీ బొద్దుగా ఉండడం వలన తల్లి పాత్రకు న్యాయం చేసింది కానీ.. నటిగా తన అభిమానులని ఆకట్టుకోలేకపోయింది.

పోలీస్ ఆఫీసర్ గా అమిత్ సాద్ ఒక్కడే తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. మొరటు పోలీసుగా అతడి బాడీ లాంగ్వేజ్, నటన ప్రశంసనీయం.

సాంకేతికవర్గం పనితీరు: రచయిత బృందం మరియు దర్శకుడు మాయాంక్ శర్మ మధ్య సరైన కోఆర్డినేషన్ లేదేమో అనిపిస్తుంది. అసలే చాలా పేలవమైన కథ, ఆ కథను ఇంకాస్త నీరసంగా ప్రెజంట్ చేసిన స్క్రీన్ ప్లే, సిరీస్ మొత్తంలో కనీసం ఒక్కటంటే ఒక్క అలరించే సన్నివేశం, ట్విస్ట్ లేకపోవడం అనేది గమనార్హం. అపరిచితుడు, చంద్రముఖి సినిమాలు తీసేసిన బీ గ్రేడ్ సిరీస్ లా ఉంటుంది “బ్రీత్ ఇన్ టు ది షాడోస్”. మాధవన్ సెట్ చేసిన మార్క్ ను కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వలేకపోయారు.

సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ అక్కడక్కడా పర్వాలేదు అనిపించేలా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ లో భారీతనం ఉన్నా ప్లానింగ్ లేదని అర్ధమవుతుంటుంది.

విశ్లేషణ: ఎంత మంచి టీం ఉన్నా.. సరైన కథ-కథనం లేకపోతే సినిమా అయినా, సిరీస్ అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది అని చెప్పడానికి చక్కని ఉదాహరణ “బ్రీత్ ఇన్ టు ది షాడోస్”. 12 ఎపిసోడ్ల ఈ సిరీస్ ను చూడాలంటే బోలెడంత టైమ్ తోపాటు ఓపిక కూడా చాలా అవసరం. మరీ ఖాళీగా ఉన్నాం, ఏ పని లేదు, బోర్ ని కూడా భరించగలం అనుకుంటే తప్ప ఎవాయిడ్ చేయదగిన సిరీస్ ఇది.

రేటింగ్: 2/5

Click Here To Read English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus