2014లో మరాఠీలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రం “హ్యాపీ జర్నీ”. ఆ చిత్రాన్ని మలయాళంలో ఓ మూడేళ్ళ క్రితం నజ్రియా ప్రధాన పాత్రలో “కూడే” అనే పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడే అదే చిత్రాన్ని తెలుగులో అవికా గోర్ ప్రధాన పాత్రలో రూపొందించారు. మరి మరాఠీ, మలయాళ వెర్షన్ రేంజ్ మ్యాజిక్ తెలుగు వెర్షన్లో రీక్రియేట్ అయ్యిందో లేదో చూద్దాం..!!
కథ: పుట్టినప్పటి నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుంటుంది సుభద్ర (అవికా గోర్). ఆమె ట్రీట్మెంట్ కోసం ఫ్యామిలీ మొత్తం చాలా కష్టపడుతుంది. ముఖ్యంగా అన్నయ్య మాధవ్ (నవీన్ చంద్ర) చెల్లెలి ట్రీట్మెంట్ కోసం చిన్నప్పుడే దుబాయ్ వెళ్ళి సంపాదన మొదలెడతాడు. అందరూ అంతలా కష్టపడినప్పటికీ సుభద్ర కొద్ది కాలానికి మరణిస్తుంది. అయితే.. దహనసంస్కార కార్యక్రమాలకు వచ్చిన మాధవ్ కు మాత్రం సుభద్ర కనబడుతుంటుంది. చనిపోయిన సుభద్ర అన్నయ్య మాధవ్ కు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? అనేది సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న “బ్రో” సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల పనితీరు: నవీన్ చంద్రను ఇప్పటివరకు చాలా డిఫరెంట్ రోల్స్ లో చూసాం కానీ.. ఈ సినిమాలో తన బెస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ లో నవీన్ నటన మనసును తాకుతుంది. అవికా క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అయితే.. ఆమె డబ్బింగ్ ఆమె నటనను డామినేట్ చేసింది. తండ్రిగా దేవి ప్రసాద్ మరోసారి ఆకట్టుకున్నారు. తల్లి పాత్రలో ప్రమోదిని ఒద్దికగా నటించారు. హీరోయిన్ సంజన సారధి పర్వాలేదు అనిపించుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ప్రతిభను మెచ్చుకోవాలి. సినిమాలోని ప్రతి ఎమోషన్ ను తన నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేసాడు. అలాగే పాటలు కూడా వినసొంపుగా, శ్రావ్యంగా ఉన్నాయి. ఈమధ్యకాలంలో ఇంత మంచి సాహిత్యంతో పాటలు రాలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చు. కలర్ కాంబినేషన్స్ విషయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా ఆ వ్యాన్ కలర్ వల్ల సినిమాకి నీరసం వచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలోనూ ఇంకాస్త మంచి అవుట్ పుట్ కోసం ఖర్చు చేసి ఉండొచ్చు అనిపించింది.
నటీనటుల ఎంపిక, వారి పాత్రలకు పేర్లు పెట్టిన పేర్లతోనే సగం విజయం సాధించాడు దర్శకుడు కార్తీక్. వసుదేవుడు-దేవకికి పుట్టిన మాధవ్-సుభద్ర ల కథగా “బ్రో” చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం. ప్రతి నటి/నటుడు నుంచి సన్నివేశానికి తగిన ఎమోషన్ ను రాబట్టుకోవడంలోనూ తన సత్తా చూపించాడు. అయితే.. ఇంకాస్త బడ్జెట్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం మంచి అవుట్ పుట్ ఇచ్చేవాడేమో అనిపించింది. అయితే.. మలయాళ వెర్షన్ రేంజ్ ను మ్యాచ్ చేయలేకపోయాడు. కానీ.. దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.
విశ్లేషణ: ఒక మంచి ఎమోషన్ ఉన్న సినిమా “బ్రో”. అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం కానీ.. కనెక్ట్ అయినవాళ్లకి మాత్రం విపరీతంగా నచ్చుతుంది ఈ చిత్రం. నవీన్ చంద్రలోని మెచ్యూర్డ్ యాక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా. శేఖర్ చంద్ర సంగీతం ఆస్వాదిస్తూ ఈ చిత్రాన్ని సోనీ లైవ్ లో హ్యాపీగా చూసేయండి.