Bubblegum Review in Telugu: బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 29, 2023 / 10:42 AM IST

Cast & Crew

  • రోషన్ కనకాల (Hero)
  • మానస చౌదరి (Heroine)
  • చైతు జొన్నలగడ్డ, హర్ష వర్ధన్, కిరణ్ మచ్చా, బిందు చంద్రమౌళి (Cast)
  • రవికాంత్ పేరేపు (Director)
  • పి.విమల (Producer)
  • శ్రీచరణ్ పాకాల (Music)
  • సురేష్ రగుటు (Cinematography)
  • Release Date : డిసెంబర్ 29, 2023

తిరుగులేని బుల్లితెర మహారాణి సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన చిత్రం “బబుల్ గమ్”. “క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరేపు తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా తెలుగమ్మాయి మానస చౌదరి కథానాయికగా పరిచయమయ్యింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టార్గెట్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: ఊరమాస్ బస్తీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల), అల్ట్రా మోడ్రన్ క్లాస్ పిల్ల జాను (మానస చౌదరి). ఈ ఇద్దరి ప్రపంచాలు వేరు, ఆలోచనలు వేరు, ఔకాత్ లు వేరు. కానీ.. ఒకరంటే ఒకరికి ఎందుకో తెలియని ఇష్టం. ఆది ఏం చేసినా మురిసిపోతుంటుంది జాను. జాను కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటాడు ఆది.

అయితే.. జాను తన చుట్టూ కట్టుకున్న గాజు భవనంలో ప్రవేశించడానికి నానా తంటాలు పడుతుంటాడు ఆది. సరిగ్గా ఎంట్రీ దొరికింది అనుకొనేలోపు.. ఓ చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఆదిత్య వస్త్రాపహరణం జరుగుతుంది. దాంతో.. కథ అడ్డం తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే.. “బబుల్ గమ్” సినిమా చూడాలన్నమాట.

నటీనటుల పనితీరు: రోషన్ కనకాల చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. చాలా కీలకమైన వస్త్రాపహరణ సన్నివేశంలో అతడి హావభావాలు ప్రశంసనీయం. మొదటి సినిమాకి అతడు చూపిన పరిణితి అతడెంతలా ప్రిపేరయ్యి ఇండస్ట్రీకి వచ్చాడు అనేది స్పష్టపరుస్తుంది. అయితే.. ఎమోషనల్ సీన్స్ విషయంలో మాత్రం ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. రొమాన్స్, డ్యాన్స్ లో పర్వాలేదనిపించుకున్నాడు.

తెలుగమ్మాయి మానస చౌదరి హావభావాల ప్రకటనలో ఓనమాలు దిద్దుతున్నా.. మొహమాటపడకుండా, లెక్కపెట్టకుండా చేసిన ముద్దు సన్నివేశాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొస్తాయి. నటిగా అలరించలేకపోయినా.. చాలా ఈజ్ తో తెరపై కనిపించిన తీరు మాత్రం ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది.

ఈ ఇద్దరి తర్వాత సినిమాలో విశేషంగా ఆకట్టుకున్న వ్యక్తి చైతు జొన్నలగడ్డ. హీరో తండ్రిగా నటించిన ఈయన ఏ యాంగిల్ లోనూ ఫాదర్ లా లేకపోయినా.. మంచి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు గట్టిగా పేలాయి. త్వరలో ఇతను బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఈయన హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ కావడం విశేషం. మోడ్రన్ పేరెంట్స్ గా అను హాసన్, హర్షవర్ధన్, మధ్యతరగతి తల్లిగా బిందు చంద్రమౌళి, స్నేహితులుగా అనన్య ఆకుల, కిరణ్ మచ్చాలు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి మోడ్రన్ టచ్ ఇవ్వడం కోసం శ్రీచరణ్ పాకాల పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో వినిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ కి ఈడీయమ్ మ్యూజిక్ తో చేసిన మిక్స్ బాగుంది. అలాగే.. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. సురేష్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. కొత్తగా కనిపించకపోయినా.. రియలిస్టిక్ గా ప్రెజంట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా బాగుంది.

దర్శకుడు మరియు రచయిత రవికాంత్ ఈ సినిమాను యూత్ ఆడియన్స్ ను టార్గెట్ గా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలతో తన టార్గెట్ ను దాదాపుగా అందుకోనే ప్రయత్నం చేశాడు కానీ.. నవతరం కన్ఫ్యూజ్డ్ లవ్ స్టోరీని, ఓపెన్ ఎండింగ్ తో ముగించడం మాత్రం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే.. హీరోను మరీ ఇన్స్టాగ్రామ్ లో కనిపించే హైద్రాబాద్ మోడా…ల్ లా చూపించడం కూడా అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కథ-క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్ గా, యూత్ & నీష్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా రాసుకున్న రవికాంత్.. కొన్ని సందర్భాలను కంపోజ్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

హీరో క్లిస్టర్ క్లియర్ ఐడియాలజీ నుండి కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ కు కన్వెర్ట్ అయ్యే విధానాన్ని ఇంకాస్త క్లారిటీగా చూపించి ఉంటే అతడి పాత్ర ఇంకాస్త మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి.. ఆ తరహా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేది. ఇకపోతే.. కథనం & క్యారెక్టర్ ఆర్క్స్ విషయంలో బాలీవుడ్ చిత్రాలు “రాక్ స్టార్ & తమాషా” పదే పదే గుర్తుకురావడం కొసమెరుపు.

విశ్లేషణ: పేరుకు తగ్గట్లే “బబుల్ గమ్” కొన్ని చోట్ల తియ్యగా.. ఇంకొన్ని చోట్ల చప్పగా సాగుతుంది. హైద్రాబాద్ మోడాల్ యూత్ & నీష్ ఆడియన్స్ ఓ మేరకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఫుల్లు రొమాన్స్, కొంచం హాస్యం, మంచి తండ్రీకొడుకుల కెమిస్ట్రీ కలగలిసి “బబుల్ గమ్” అలరిస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏమేరకు పెర్ఫార్మ్ చేస్తుంది అనేది మాత్రం కాస్త సందేహమే. అందుకు కారణం కథనం & క్యారెక్టర్ ఆర్క్స్ లో కొరవడిన క్లారిటీ & దర్శకుడు కొత్తగా ప్రయత్నిస్తూ.. ఓపెన్ గా వదిలేసిన ఎండింగ్.

రేటింగ్: 2.5/5

Click Here to Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus