సల్మాన్ ఖాన్ (Salman Khan) – మురగదాస్ (A.R. Murugadoss) కాంబినేషన్‌లో తెరకెక్కిన సికిందర్ (Sikandar) మూవీపై మొదట భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ లేకుండా పోయింది. ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్‌కు ముందు ఓ మాస్ టీజర్, పవర్‌ఫుల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను ఉత్సాహపరచడం సాధారణం. కానీ సికిందర్ విషయంలో మాత్రం టీజర్ విడుదలైనప్పటి నుంచి పెద్దగా చర్చ లేదు. మురగదాస్ గత చిత్రాల్లో ఉన్న స్టైల్, కంటెంట్ ఇక్కడ కనపడకపోవడంతో ఈసారి ఎలా చూపించబోతున్నాడో అనే సందేహాలు పెరుగుతున్నాయి.
సల్మాన్ ఖాన్‌కు ఈద్ సీజన్‌లో సినిమాను విడుదల చేయడం పక్కా సెంటిమెంట్. గతంలో భజరంగీ భాయిజాన్, సుల్తాన్, టైగర్ జిందా హై వంటి సినిమాలు ఈద్ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. అందుకే సికిందర్ ను కూడా మార్చి 28న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఈసారి ప్రమోషన్ లెవెల్ తగ్గిపోవడంతో, సినిమా టాక్ మౌత్‌పబ్లిసిటీ మీదే ఆధారపడేలా ఉంది.
మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ పరంగా ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మురగదాస్ కెరీర్‌ను పరిశీలిస్తే, గజని, తుపాకి (Thuppakki) , కత్తి (Kaththi) వంటి సినిమాలు ఆయన మార్క్ అద్భుతంగా చూపించాయి. హై-ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, లాజికల్ మాస్ మసాలా కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మురగదాస్ సినిమాలు ఉంటాయి. కానీ ఆయన గత సినిమాలు చూస్తే.. సర్కార్ (Sarkar) , దర్బార్ (Darbar) లాంటి చిత్రాలు మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచాయి.
దీంతో సికిందర్ మురగదాస్‌కు చాలా కీలకమైన సినిమా. ఈ సినిమా హిట్ అయితేనే మళ్లీ ఆయనకు క్రేజ్ వస్తుంది. ఇప్పటికే టీజర్, పాటలు బాగా వైరల్ కాలేకపోవడంతో, ఓపెనింగ్స్ విషయంలో సల్మాన్ ఖాన్ ఇమేజ్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. బాలీవుడ్ మార్కెట్‌లో సల్మాన్ సినిమాలకు మాస్ ఓపెనింగ్స్ ఉంటాయి, కానీ తర్వాత కంటెంట్ డిసైడ్ చేస్తుంది. మురగదాస్ ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.