తమిళ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరించిన చిత్రం “కెప్టెన్”. హాలీవుడ్ చిత్రాలను కోలీవుడ్ లో ఫ్రీమేక్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: హిమాలయాల దగ్గరలో సెక్టర్ 42లో ఓ ఆర్మీ గ్రూప్ దారుణంగా హత్య చేయబడతారు. ఆ హత్య చేసింది ఎవరు అనే విషయాన్ని కనుక్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఓ స్పెషల్ టీం ను నియమిస్తుంది. కెప్టెన్ విజయ్ కుమార్ (ఆర్య) మరియు అతని బృందం ఈ మిషన్ ను ఎలా చేధించారు? అనేది “కెప్టెన్” కథ.
నటీనటుల పనితీరు: “సార్పట్ట పరంపర” లాంటి అద్భుతమైన సినిమా తర్వాత ఆర్య నటించిన సినిమా కావడంతో “కెప్టెన్”పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. ఆర్య నటుడిగా కెప్టెన్ పాత్రలో ఇమడలేకపోయాడు. గ్రాఫిక్స్ & సీజీ వర్క్ కూడా అందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
హరీష్ ఉత్తమన్ సపోర్టింగ్ రోల్లో అలరించారు. ఐశ్వర్య లేక్ష్మి ప్రత్యేక పాత్రలో పర్వాలేదనిపించుకుంది. సిమ్రాన్ కు మంచి పాత్ర లభించినప్పటికీ.. సదరు పాత్రకు సరైన జస్టిఫికేషన్ లేకపోవడంతో ఎవరూ ఆ పాత్రకు పెద్దగా కనెక్ట్ అవ్వరు.
సాంకేతికవర్గం పనితీరు: సి.జి.వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఏలియన్ క్రీచర్ ను క్రూరంగా చూపించాలనే ఆలోచన బాగున్నా.. దాని ఆచరణ మాత్రం ఘోరంగా ఉంది. చాలా సన్నివేశాల్లో ఆ సీజీ వర్క్ చిరాకుపుట్టిస్తుంది కూడా. డి.ఇమ్మాన్ పాటలు, నేపధ్య సంగీతం సోసోగా ఉండగా.. కెమెరా వర్క్ మాత్రం చీప్ సీజీ వర్క్ కారణంగా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఇక హాలీవుడ్ సినిమాలను ఇండియనైజ్ చేయడంలో ఇప్పటికే పలుమార్లు బోల్తా కొట్టిన శక్తి సౌందర్ రాజన్.. “కెప్టెన్”తోనూ అదే తరహాలో బొక్కబోర్లా పడ్డాడు. ఆల్రెడీ “ఏలియన్ వెర్సెస్ ప్రెడేటర్, ప్రే” వంటి సినిమాలు చూసి ఉన్న ఆడియన్స్ కు ఈ చీప్ వెర్షన్ అస్సలు ఎక్కదు. ఒకవేళ ఆ హాలీవుడ్ సినిమాలు చూడకపోయినా.. పూర్ సీజీ వర్క్ & స్క్రీన్ ప్లే కారణంగా సగటు ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.
విశ్లేషణ: హాలీవుడ్ యాక్షన్ సినిమాలు చూసే అలవాటు లేక, చాలా తక్కువ స్థాయి సీజీ వర్క్ ను చూడగలిగే ఓపిక ఉంటే తప్పితే “కెప్టెన్” చిత్రాన్ని థియేటర్లలో చూడడం కష్టం.