ఓటీటీల్లో విచ్చలవిడితనం పెరిగిపోతోందని, అభ్యంతరకర దృశ్యాలు పెచ్చురిల్లుతున్నాయని గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని ఓటీటీలు, వెబ్‌సైట్లలో ఆ తరహా కంటెంట్‌ను అదుపు చేయాలని పలువురు, పలుదఫాలుగా, పలురకాలుగా కోరుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 24 ఓటీటీలు/ వెబ్‌సైట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిలో ప్రముఖ ఓటీటీలు కూడా కొన్ని ఉన్నాయి.
అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న కొన్ని ఓటీటీ మాధ్యమాలు, వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం నిషేధించిన యాప్స్ / వెబ్‌సైట్లలో ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్, కంగన్, బుల్, జల్వా, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్ ప్రైమ్, ఫినియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ఎక్స్ వీఐపీ, హల్‌చల్, మూడ్ ఎక్స్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైఫ్లిక్స్ ఉన్నాయి.
ఆయా యాప్‌లు, వెబ్‌సైట్లను పని చేయకుండా, కన్పించకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. ఓటీటీలు, తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం గుర్తుచేసింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లు ఇక అందుబాటులో ఉండవు. అయితే ఇలాంటి కంటెంట్ అందించే యాప్‌లు, సర్వీసులు ఇంకొన్ని ఉన్నాయి. వాటిపై కూడా కేంద్రం త్వరలో చర్యలు తీసుకుంటుంది అని సమాచారం.