యంగ్ హీరో కార్తికేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై బజ్ వచ్చింది. అయితే తీరా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ఓ షార్ట్ ఫిలింకి కాపీ అంటూ విమర్శలు రావడం మొదలయ్యాయి. ఈ సినిమా చూసిన వారంతా.. సోషల్ మీడియాలో దర్శకుడిపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
2020లో విడుదలైన ‘నివాసి’ అనే షార్ట్ ఫిలిం ఆధారంగా దర్శకుడు కౌశిక్ ఈ సినిమా తీశాడంటూ అతడిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇదే విషయంపై ఓ నెటిజన్ నేరుగా కౌశిక్ ని ప్రశ్నించాడు. ”నివాసి షార్ట్ ఫిల్మ్ కి ఇది డబ్బింగ్ వెర్షన్.. ఇలా చేశావ్ ఏంటన్నా..?” అని కౌశిక్ ని అడగ్గా.. అతడు చాలా కూల్ గా స్పందించాడు. ”ఇప్పటివరకు సినిమా చూడకపోతే గనుక మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్లి చూడండి. అప్పటికీ మీకేమైనా సందేహాలు ఉంటే..
స్టోరీ రిజిస్ట్రేషన్ డేట్, టైమ్, ఇయర్ కి సంబంధించిన అగ్రిమెంట్ మీతో షేర్ చేస్తా” అంటూ బదులిచ్చాడు. నివాసి సినిమా 2020లో విడుదలైంది. అయితే అప్పటికే ‘చావు కబురు చల్లగా’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. దర్శకుడు కౌశిక్ పోస్ట్ ని బట్టి చూస్తుంటే.. తన కథనే వేరే వాళ్లు కాపీ చేసి ఉంటారని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపించింది. ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ లు కీలకపాత్రలు పోషించారు.