చేసిన సినిమాలన్నీ విజయం సాధించకపోవచ్చు.. కానీ సాధించిన విజయం మాత్రం కలకాలం గుర్తుండిపోవాలి అనుకుంటారు సినిమా వాళ్లు. అందుకే ప్రతి సినిమాని ఆ ఆలోచనతో చేస్తారు. ఫలితం సంగతి పక్కన పెడితే.. పడిన కష్టానికి తగి ప్రతిఫలం ప్రశంసల రూపంలో వచ్చినా చాలు. కొన్ని రెండూ వస్తే ఆ ఆనందమే వేరు. అయితే ఈ ఆనంద సమయంలో పైరసీ అనే ఓ సమస్య వస్తే ఆ ఆనందం మొత్తం ఆవిరైపోతుంది.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) . ‘తండేల్’ (Thandel) సినిమాతో రీసెంట్‌గా మంచి విజయం అందుకున్నారాయన. వసూళ్లు వస్తున్నాయి, ప్రశంసలూ వస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలో సినిమా పైరసీ బయట స్వైర విహారం చేస్తోంది. దీంతో చాలా ఇబ్బందిపడింది టీమ్. దీని గురించి రీసెంట్‌గా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. థియేట్రికల్ ఫీలింగ్ కోసం కష్టపడి సినిమా తీస్తే, కొంతమంది పైరసీ చేసేశారు అని బాధపడ్డారు చందు మొండేటి. ఇలాంటి సినిమాలు థియేటర్లలో చూస్తే ఆ అనుభవమే వేరు అని చెప్పారు.
పైరసీ మాట విన్నాక గుండెల్లో గునపంతో పొడిచినట్లు అయింది అని చెప్పారాయన. అంతేకాదు ఆ బాధని మాటల్లో చెప్పలేం అంటూ బాధపడ్డారు. దీంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కొత్త సినిమాల సంగతేంటి అని అడిగితే.. 300 ఏళ్ల క్రితం జరిగే ఓ పీరియాడిక్ కథని సిద్ధం చేశానని, సూర్య (Suriya) కథానాయకుడిగా ఆ సినిమాని చేయాలని కథ వినిపించా అని చెప్పారు. మరి ఆయన నుండి ఎలాంటి స్పందన వచ్చింది అనేది తెలియాలి.
ఎందుకంటే ఇలాంటి కథ (కంగువ)తో (Kanguva) ఆయన ఇటీవల ఇబ్బందిపడ్డారు. ఈ సినిమా కాకుండా ‘కార్తికేయ 3’ ఉంది. అలాగే నాగచైతన్యతో (Naga Chaitanya) ‘తెనాలి రామకృష్ణుడు’ చేయాల్సి ఉంది అని చెప్పారు. తనకైతే నాగార్జున (Nagarjuna) తోనూ సినిమా చేయాలనేది కల అని చెప్పారు. సరైన కథ సిద్ధమైతే ఆయనకు వినిపిస్తా అని అన్నారు.