బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా మారిన ఛావా (Chhaava) సినిమా దూకుడు ఆగడం లేదు. మూడో వారంలోనే 555 కోట్ల గ్రాస్‌ను దాటేసి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నిన్న చిత్రబృందం నుంచి అధికారికంగా వసూళ్ల ప్రకటన రాగా, కేవలం భారతదేశంలోనే 484 కోట్ల మేర భారీ కలెక్షన్లు సాధించిందని స్పష్టమైంది. ఈ దూకుడు ఎంత కాలం కొనసాగుతుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో వచ్చే వారంలో ఛావా తెలుగు వెర్షన్ విడుదల కానుండటంతో మరింత హైప్ పెరిగింది.
అయితే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రధానమైన ప్రశ్న – ఛావా 1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా?. వాస్తవానికి ఈ లెక్కను చేరుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పటివరకు 555 కోట్ల మార్క్‌ను దాటినప్పటికీ, 1000 కోట్లకు ఇంకా చాలా దూరం ఉంది. మొదటి రెండు వారాల్లో స్పీడ్‌గా వసూళ్లు రాబట్టిన సినిమా, మూడో వారం నుంచి థియేట్రికల్ రన్ కాస్త నెమ్మదించింది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో టికెట్ అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి.
అయితే బుక్ మై షో లాంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఛావా (Chhaava) ఇప్పటికీ నెంబర్ వన్ పొజిషన్‌ను దక్కించుకోవడం గమనించాల్సిన విషయం. ఇక ఛావా కలెక్షన్లకు ఎక్కడ అడ్డుకట్ట పడుతుందనే విషయం గురించి మాట్లాడుకుంటే, కొన్ని కీలకమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కంటెంట్ పరంగా ఒక వర్గానికి, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు అత్యంత సంబంధితంగా ఉండడం వల్ల, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అదే స్థాయిలో కనెక్ట్ కాలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
పైగా ఇటీవల ఈ మూవీకి సంబంధించి హెచ్‌డీ పైరసీ లీక్ కావడం మరో ప్రతికూల అంశంగా మారింది. అయితే ఒకవేళ ఛావా 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంటే, అది నిజంగా గొప్ప రికార్డ్ అవుతుంది. భవిష్యత్తులో చైనా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేస్తే, అక్కడి ప్రేక్షకులు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారనేది ఆసక్తికరమైన అంశం. అదీగాక ఓటీటీ రిలీజ్ 50 రోజుల తర్వాతే ఉండటం వల్ల థియేట్రికల్ రన్ మరింత కొనసాగుతుందని అంచనా.
ముఖ్యంగా వీకెండ్స్‌లో మళ్లీ వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సాధించిన వసూళ్లను గమనిస్తే, ఛావా 700-800 కోట్ల గ్రాస్‌ను మాత్రం సులభంగా అందుకోవచ్చనే విశ్లేషణ ఉంది. ఇక మార్చి 7న విడుదలయ్యే తెలుగు వెర్షన్ ఈ వసూళ్లను మరింతగా పెంచుతుందనే నమ్మకంతో అల్లు అరవింద్ అండ్ టీమ్ ఉన్నారు. తెలుగులోనూ భారీ వసూళ్లు రాబడితే, ఛావా 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం అసాధ్యం కాదు. మరి మరాఠా వీరుడి గాథ ఆ మైలురాయిని అందుకుంటుందా లేదో వేచి చూడాలి.