మీ టూ ఉద్యయం తీవ్ర స్థాయికి చేరుకుంది. దేశంలో ఎక్కడ చూసిన దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణాదిన గమనిస్తే గాయని చిన్మయి చెప్పిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. హీరోయిన్ అవకాశాల కోసం తిరిగేవారు మాత్రమే కాదు.. సినిమా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేసే మహిళలు లైంగిక వేధింపులకు గురైనవారేనని ఆమె మాటలబట్టి అర్ధమవుతోంది. తనకి జరిగిన వేధింపులు మాత్రమే కాదు.. ఇతరుల బాధలను సైతం తన గొంతుతో మీడియాకి వివరిస్తోంది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కొందరు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చిన్మయి ట్విట్టర్ ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన వైరముత్తు… ఆరోపణలు చేసే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సవాల్ చేశారు.
వీరి గొడవ మాటలు దాటి బెదిరింపు స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. “నేను చేస్తున్న ‘మీటు’ ఉద్యమాన్ని ఆపి వేయాలని..లేదంటే నన్ను చంపేస్తామని.. నాపై యాసిడ్ పోస్తామని బెదిరిస్తున్నారు. అదే విధంగా గత వారం రోజులుగా ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనను అప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు చెబుతున్నావని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరు ఎంత బెదిరించినా తాను లైంగిక వేధింపుల పై పోరాటం ఆపనని చిన్మయి స్పష్టంచేసింది. అలాగే వైరముత్తుపై త్వరలోనే కేసు పెట్టనున్నట్లు ప్రకటించింది.