సాంకేతికవర్గం:
దర్శకత్వం: అరుణ్ మతేశ్వరన్
ఛాయాగ్రహణం: యామిని యజ్ణమూర్తి
సంగీతం: సామ్ సి.ఎస్
నిర్మాణం:
నిర్మాత: సిద్ధార్ధ్ రావిపాటి
విడుదల తేదీ: మే 06, 2022
కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో తమిళంలో రూపొందించిన చిత్రం “సాని కాయిధం”. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడిగా పరిచయమైన తొలి చిత్రమిది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మే 6) అమేజాన్ ప్రైమ్లో “చిన్ని” అనే పేరుతో అనువాదరూపంలో విడుదలైంది. విడుదలైన టీజర్ & ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేశాయి. సదరు అంచనాలను సినిమా అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!
కథ:
తనను బలవంతంగా మానభంగం చేయడమే కాక.. తన కుటుంబాన్ని దారుణంగా తగలబెట్టి చంపిన వారిపై తన అన్నయ్య రంగయ్య (సెల్వ రాఘవన్)తో కలిసి చిన్ని సాగించిన మరణ మృదంగమే “చిన్ని” కథాంశం.
నటీనటుల పనితీరు:
నటిగా కీర్తిసురేష్ పూర్తిస్థాయి పొటెన్షియల్ ను వినియోగించుకున్న చిత్రం “మహానటి” అయితే.. నటిగా ఆమెలోని సరికొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రం “చిన్ని”. ఆమెలోని క్రోధాన్ని, ఆవేశాన్ని అద్భుతంగా ప్రెజంట్ చేసిన సినిమా ఇది. కీర్తిలోని ఈ కొత్త యాంగిల్ కచ్చితంగా ప్రశంసించాల్సిన విషయం. ముఖ్యంగా వ్యాన్ తో రౌడీ గ్యాంగ్ ను గుద్దేసే సన్నివేశంలో ఆమె హావభావాలు గగుర్పాటుకు గురి చేస్తాయి.
నటుడిగా సెల్వ రాఘవన్ తొలి చిత్రంతోనే విశేషమైన రీతిలో ఆకట్టుకున్నాడు. అతడి క్యారెక్టరైజేషన్ కు శుభలేక సుధాకర్ వాయిస్ పెద్ద ఎస్సెట్. సెల్వ బాడీ లాంగ్వేజ్ & పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు:
ముందుగా సినిమాటోగ్రాఫర్ యామిని యజ్ణమూర్తి పనితనం గురించి చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో అతి తక్కువ మంది లేడీ కెమెరా ఉమెన్స్ లో యామిని ఒకరు. ఈ చిత్రంలో ఆమె ఎంచుకున్న ఫ్రేమింగ్స్ & లైటింగ్ సినిమా మూడ్ ని అద్భుతంగా ఎలివేట్ చేయడమే కాక ఆడియన్స్ ను సినిమా మూడ్ లోకి ఇన్వాల్వ్ చేసింది. టింట్ దగ్గరనుంచి కలర్ గ్రేడింగ్ వరకూ ప్రతి ఒక్క అంశం సినిమాకి ప్లస్ అయ్యాయి.
సామ్ సి.ఎస్ సంగీతం సినిమాకి మరో ఎస్సెట్. యామిని తన సినిమాటోగ్రఫీతో సెట్ చేసిన మూడ్ ని తన నేపధ్య సంగీతంతో ఇంకాస్త ఎలివేట్ చేశాడు సామ్. రామచంద్రన్ ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. ఏ సన్నివేశం ఎంత అవసరమో అంతే నిడివి ఉంది, అందువల్ల ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా బోర్ కొట్టలేదు.
దర్శకుడు అరుణ్ ఒక సాధారణ రివెంజ్ డ్రామాను.. పచ్చిగా, రక్తసిక్తంగా తెరకెక్కించిన తీరు బాగుంది. కీర్తిసురేష్ లాంటి నటితో ఈ తరహా ప్రయత్నం చేయడమే పెద్ద సాహసం. అలాగే సెల్వరాఘవన్ లాంటి కల్ట్ డైరెక్టర్ ను యాక్టర్ గా ఎలివేట్ చేయడం అనేది దర్శకుడిగా అరుణ్ సాధించిన మరో ఘనత. ఈ రెండు అసాధ్యాలను సుసాధ్యం చేయడం దగ్గరే అరుణ్ 90% విజయాన్ని అందుకున్నాడు. ఇక సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలను కాండాలుగా విడదీసిన విధానం, హత్యా సన్నివేశాలను అత్యంత సహజంగా తెరకెక్కించడం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. కథకుడిగా కంటే దర్శకుడిగా మంచి విజయం దక్కించుకున్నాడు అరుణ్ మతేశ్వరన్. అయితే.. సినిమాలో క్వెంటిన్ టరంటినో ఛాయలు కనిపించడం ఒకరకంగా ప్లస్ అయినప్పటికీ.. మరీ ఎక్కువగా రిఫరెన్సులతో సినిమా నిండిపోవడం అనేది దర్శకుడిగా అరుణ్ మార్క్ ను కనిపించకుండా చేస్తుంది. ఈ విషయంలో అరుణ్ కాస్త జాగ్రత్త వహించాలి.
విశ్లేషణ:
సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన “కిల్ బిల్” రేంజ్ సినిమా “చిన్ని”. నటిగా కీర్తిసురేష్ లోని మరో కోణం, సెల్వరాఘవన్ అద్భుత నట ప్రదర్శన, యామినీ కెమెరా ఫ్రేమింగ్స్, సామ్ నేపధ్య సంగీతం, అరుణ్ టేకింగ్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే.