కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇంటికి మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి కలవడం సర్వత్రా చర్చనీయాంసం అయ్యింది. ‘కొంపతీసి మెగాస్టార్ చిరంజీవి కానీ వెళ్ళి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరతారా’ అనే డిస్కషన్ మొదలైంది. ఓ పక్కన చిరంజీవి తమ్ముడు ‘జనసేన’ పార్టీ తో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే .. ఇప్పుడు అన్నయ్య వెళ్ళి జగన్ ప్రభుత్వం లో జాయిన్ అవుతారా ఏంటి.. ‘ అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి.అయితే అలాంటిది ఏమీ లేదు అని తాజాగా మెగాస్టార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ…”జగన్ ను కలిసినప్పుడు మా మధ్య ఎటువంటి రాజకీయపరమైన చర్చలు జరగలేదు. జగన్ కూడా నా వద్ద రాజకీయాల ప్రస్తావన తీసుకురాలేదు. ఆ గౌరవాన్ని ఆయన అలాగే ఉంచారు. వైసీపీలోకి నన్ను ఆహ్వానిస్తారని కూడా నేను భావించడం లేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు… పవన్ మాటే మా అందరి మాట… ఇదే విషయాన్ని ఇంతకు ముందే నేను చెప్పాను. 64 ఏళ్ల వయసులో మళ్లీ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచన నాకు లేదు. ముందు నుండీ కూడా జగన్ కుటుంబంతో నాకు మంచి సన్నిహిత సంబంధం ఉంది.
ఆ సాన్నిహిత్యంతోనే జగన్ ను కలిశాను. నిజానికి జగన్ ప్రమాణస్వీకారానికి నేను కూడా వెళ్లాల్సి ఉంది… కాని నాకు ఆ సమయంలో కాలు బాగోలేకపోవడంతో వెళ్లలేకపోయాను. ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. జగన్ ని కలవడం, వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం మరచిపోలేని అనుభూతి. ఆయన తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కూడా నాకు నచ్చింది కాబట్టే నేను అభినందించాను. ఎవరు మంచి చేసినా నేను అభినందిస్తాను. దీన్ని రాజకీయం చేయడం సరైనది కాదు.