చిరంజీవి (Chiranjeevi) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) – నయనతార (Nayanthara) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడల్లా ‘రఫ్ఫాడించేద్దాం’ అని టీం అంటూ వస్తోంది. దీంతో దీనినే పేరుగా పెట్టేస్తారా? అనే డౌట్ కూడా ఉంది ఫ్యాన్స్. సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ అయిపోయినా ఇంకా టైటిల్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే సినిమా ప్రచారం విషయంలో అనిల్ రావిపూడి ఇప్పటికే కొన్ని ప్లాన్స్ వేసుకున్నారని, వాటిని అమలు చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అని సమాచారం.
మెగాస్టార్ ఫ్యాన్స్‌కి మరచిపోలేని డేట్ నుండి ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రచారం షురూ చేయాలని అనిల్ రావిపూడి నిర్ణయించారట. ఆ డేట్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండీ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22 నుండి సినిమా ప్రమోషన్స్ షురూ చేసే పనిలో ఉన్నారట. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది. ఆ నేపథ్యంలో మూడున్నర నెలల ముందు నుండే సినిమా ప్రచారం మొదలుపెడితే బాగుంటుది అని ప్లాన్ చేస్తున్నారట.
ఆగస్టు 22న సినిమా గ్లింప్స్ విత్ టైటిల్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఇంత క్లియర్‌గా చెప్పకపోయినా ఆ రోజు నుండి సినిమా ప్రచారం ఉంటుంది అని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా భార్యా భర్తల స్టోరీ అని కూడా చెప్పుకొచ్చారు. 70% కామెడీ, 30 ఎమోషనల్ డ్రామా ఉంటుందని, చిరంజీవిని ఇటీవల కాలంలో ఇలా ఎవరూ చూపించలేదు అని అనిల్ తెలిపారు.
‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ స్టైల్‌లో ఎమోషనల్ డ్రామా కామెడీ కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో చేసిన పాత్రతోనే ఈ సినిమాలో వెంకీ కనిపిస్తారట. రెండు సినిమాలను లింక్ చేసేలా ఆ సీన్స్ ఉంటాయి అని అంటున్నారు.