ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తనయుడు సూర్య విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సినిమాల్లోకి రానున్న విషయం తెలిసిందే. ‘ఫీనిక్స్’ అనే సినిమాతో సూర్య సినిమాల్లోకి వస్తున్నాడు. స్టంట్ కొరియోగ్రాఫర్ అణల్ అరసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సూర్య సేతుపతి మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. మామూలుగా హీరోయిన్లు ఇలాంటి మాటలు చెబుతుంటారు. కానీ సూర్య చెప్పాడు.
‘ఫీనిక్స్’ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు సూర్య విజయ్ సేతుపతి (Surya Sethupathi) 120 కేజీల బరువు ఉన్నాడట. సినిమాల్లోకి వస్తున్నాడు అని ఫిక్స్ అయ్యాక.. ఆ బరువు తగ్గడానికి ఏడాదిన్నర పట్టిందట. ఆ సమయంలో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడట. అంత బరువు నుండి సూపర్ ఫిట్‌గా మారడం తేలికైన విషయం కాదని, కానీ తాను 6 నెలలు తీవ్రంగా శ్రమించి సెట్ అయ్యానని చెప్పాడు. పంచదార, నూనె పూర్తిగా మానేశానని తన వెయిట్ లాస్ రహస్యం చెప్పాడు సూర్య.
విజయ్ సేతుపతి నటించిన ‘జవాన్’ సినిమా సెట్స్‌కు వెళ్లడం వల్ల సూర్య సేతుపతికి (Surya Sethupathi) ‘ఫీనిక్స్’ సినిమాలో అవకాశం వచ్చిందట. ఇండస్ట్రీకి రావాలని ఎప్పటినుండో అనుకుంటున్నానడట. ‘జవాన్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనల్ అరసు చూసి ‘ఫీనిక్స్’ కథ గురించి విజయ్ సేతుపతికి చెప్పాడట. ఆయన ఓకే అనుకుని.. సూర్యకు కథ చెప్పమన్నాడట.
మావాడు అంగీకరిస్తే నాకేం ఇబ్బంది లేదు అని కూడా అన్నాడట. సినిమాల్లోకి రావాలా, లేదా అనేది సూర్య నిర్ణయమే అని కూడా అన్నాడట విజయ్ సేతుపతి. అలా సూర్య సేతుపతిని కలసి అనల్ అరసు కలసి కథ చెప్పడం, ఓకే అనుకోవడం, వెంటవెంటనే జరిగిపోయాయట. మరి సూర్య ఎలా నటించాడు, తండ్రి పేరు నిలబెట్టాడా అనేది ఈ నెల 4న సినిమా వచ్చాక తెలుస్తుంది. హీరోయిన్లు చెబుతారు ఇలాంటి మాటలు అని పైన అన్నాం కదా.. అది వెయిట్ గురించే. మన వారసత్వ హీరోయిన్లు గతంలో ఇలాంటి మాటలు చెప్పారనే విషయం మీకు తెలిసే ఉంటుంది.