మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ రేపు అనగా అక్టోబర్ 5న విజయదశమి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
‘ఆచార్య’ ఫలితాన్ని మరిపించి ఈ దసరాకి మెగాస్టార్ చిరంజీవి ఓ సూపర్ హిట్ ను అందిస్తారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్'(గాడ్ ఫాదర్) తో పాటు ‘వేదాలం'( భోళా శంకర్) రీమేక్ లో కూడా నటిస్తున్నారు. అలాగే గతంలో చాలా రీమేక్ సినిమాల్లో నటించారు. ‘హిట్లర్’ ‘ఠాగూర్’ ‘శంకర్ దాదా జిందాబాద్’ వంటి చిత్రాలతో పాటు తన రీ ఎంట్రీ మూవీ అయిన 150 వ చిత్రం కోసం కూడా రీమేక్ నే నమ్ముకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అయినా ఇలా రీమేక్ చిత్రాల్లో నటిస్తుండడం పై ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా కొంత నిరాశ చెందుతూనే ఉంటారు. అయితే ఈ విషయంపై తాజాగా చిరంజీవి స్పందించారు. “రీమేక్ సినిమాలు అంటే ఎందుకు అంత తక్కువగా చూస్తారు. రీమేక్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అది ఒక ఛాలెంజ్. ఒక కంపేరిటివ్ స్టడీలో మనం నిలబడగలమా లేదా అనేది ఎప్పుడూ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది.
నేను చేసిన అన్ని రీమేక్ లు ఒరిజినల్స్ కంటే కూడా ఎక్కువగా కలెక్ట్ చేశాయి. ఆ సినిమాలకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. అలాగే నా పాత్రలకు కూడా ప్రశంసలు దక్కాయి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కంపేర్ చేసినా సరే నేను నిలబడగలను అనడానికి నా హిస్టరీనే చెబుతుంది” అంటూ చిరంజీవి రీమేక్ సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.