టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమ కోసం ఎంతో సహాయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమందికి సహాయ సహకారాలు చేసిన ఈయన సినీ కార్మికుల కోసం చిత్రపురిలో ఒక హాస్పిటల్ నిర్మిస్తానని కార్మికుల దినోత్సవం రోజున మాటిచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా చిరంజీవి మరోసారి ఈ హాస్పిటల్ గురించి పలు ఆశక్తికరమైన విషయాలను తెలియచేశారు.
తాజాగా ఈయన క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను చిత్రపురిలో హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచన తనకు కలిగినప్పుడు ఈ ఆలోచనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రతి క్షణం ఆలోచిస్తున్నానని తెలిపారు.ఇకపోతే ఎంతోమంది పేరు ప్రఖ్యాతలుగాంచిన డాక్టర్లు తనకు మిత్రులుగా ఉన్నారని వారి సహాయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయచ్చని మెగాస్టార్ వెల్లడించారు.
ఈ హాస్పిటల్ నిర్మించాలని ఆలోచన తనకు రావడమే కాకుండా తన ఆలోచనని అందరితో పంచుకోవడంతో అందరూ తనకు ఎంతో అండగా నిలిచారని ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిత్రపురి కాలనీలో 10 పడకల హాస్పిటల్ నిర్మించడమే కాకుండా పెద్దపెద్ద హాస్పిటల్ కు వెళ్లకుండా అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ వెల్లడించారు. ఇక ఈ హాస్పిటల్ నిర్మాణంలో ఎవరైనా బాగస్వాములు అయినా తాను సంతోషంగా ఆహ్వానిస్తానని
అలా కాకుండా ఎవరు ముందుకు రాకపోయినా తానే స్వయంగా ఈ హాస్పిటల్ నిర్మిస్తానని అంత శక్తి ఆ భగవంతుడు తనకు ఇచ్చాడంటూ ఈయన తెలియజేశారు.ఇకపోతే ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమై వచ్చే ఏడాది పుట్టినరోజుకు ఆ పనులు అన్నింటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపోతే ఈ హాస్పిటల్ కి తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మిస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేయడంతో ఎంతోమంది సినీ కార్మికులు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.