Chiranjeevi: అభిమానుల కొట్లాట.. చిరంజీవి ఉదాహరణ పాతదే.. ఉద్దేశం కొత్తది!

Ad not loaded.

టాలీవుడ్‌లో ఎవరికి వారు అని ఉన్న హీరోల్ని ఒక చోటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తొలి తరం వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. ఇది ఎవరూ కాదనలేని నిజం, ఎవరూ కొట్టిపారేయలేని విషయం. ఈ విషయం చిరంజీవే (Chiranjeevi) కాదు, ఆయనతో కలసి పని చేసిన నాటి, నేటి నటులు చాలామంది చెబుతారు. దానికి ఓ ఉదాహరణ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌. అదేనండీ ఇప్పుడు మంచు విష్ణు  (Manchu Vishnu)  అధ్యక్షుడుగా ఉన్న నటీనటుల సంఘం. దాని ఫౌండర్‌ ఛైర్మన్‌ చిరంజీవే అనే విషయం తెలిసిందే.

Chiranjeevi

ఇదే కాదు, నటీనటులు తరచుగా కలుస్తుండాలి, ఒకరింట్లో ఆనందం ఇంకొకరు సంబరంలా చేసుకోవాలి అని చిరంజీవి ఎప్పటి నుండో అంటూ ఉన్నారు, చేస్తుంటారు కూడా. దీని వల్ల ఫ్యాన్‌ వార్స్‌ ఉండకుండా చేయాలి అనేది ఆయన ఆలోచన. కొన్నేళ్ల క్రితం వరకు ఈ ఫ్యాన్‌ వార్స్‌ తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా మళ్లీ మొదలయ్యాయి. దీంతో మరోసారి చిరంజీవి ఫ్యాన్‌ వార్స్‌ మీద మాస్టర్‌ క్లాస్‌ తీసుకున్నాడు.

మనం విడిగా ఉండటం వల్ల ఇమేజ్‌ పెరుగుతుందనే భావం సరికాదు. అందరూ కలివిడిగా ఉండాలి అని నటులకు చిరంజీవి మరోసారి సూచించారు. ఆ కాంపౌండ్‌, ఈ కాంపౌండ్‌ అంటూ హద్దులు గీయడం మానేయాలని ఆ ఇన్‌విజిబుల్‌ లైన్‌ గురించి కూడా చెప్పాడు. ఎవరికి వాళ్లు గిరిగీసుకుని ఉన్న రోజులు ఒకప్పుడు ఉన్నాయి. దాని వల్ల హీరోల మధ్య సఖ్యత లేదనకుని, అభిమానులు కొట్టుకునేవారు. వాల్‌పోస్టర్లు చింపుకునే వాళ్లు అని అన్నారు చిరంజీవి.

చిన్నతనంలో తాము నెల్లూరు ఉండేటప్పుడు ఆయన ఇద్దరు కజిన్స్‌లో ఒకరు రామారావును, మరొకరు ఏయన్నార్‌ను అభిమానించే వాళ్లట. వాళ్లిద్దరూ ఓసారి హీరోల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారట. అందుకే నటుడిగా అయ్యాక హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ప్రయత్నం చేశా అని చెప్పారు. దీని కోసం మద్రాస్‌లో ఉన్నప్పుడు హనీ హౌస్‌లో చిత్రసీమకు సంబంధించిన వేడుకలు నిర్వహించుకునే వాళ్లం అని చెప్పారు.

దాని వల్ల అప్పట్లో తమ మధ్య ఉన్న అరమరికలు తొలగిపోయి సంతోషంగా గడిపేవాళ్లమని, ఈ రోజుకూ నేను, నాగార్జున (Nagarjuna), వెంకటేశ్ (Venkatesh), బాలకృష్ణ (Nandamuri Balakrishna)  కలసికట్టుగా ఉండటానికి, ఒకరి వేడుకకు మరొకరం వెళ్లడానికి అదే కారణమని చెప్పాడు. ఓ హీరో మరో హీరోను అభిమానించడాన్ని తప్పుగా చూడొద్దని కోరాడు.

‘కాంపౌండ్‌’ కామెంట్లు.. చిరు అదిరిపోయే రిప్లై… ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus