మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రాజకీయాల్లో ఉన్నప్పుడు.. తిరిగి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చేనందుకు సన్నాహాలు చేస్తున్న టైం అది. ఆ టైంలో చిరు రీ- ఎంట్రీకి ఏ దర్శకుడు అయితే బెటర్ అనే డిబేట్ జరిగింది. అప్పట్లో ఫామ్లో ఉన్న వి.వి.వినాయక్ నుండి రాంగోపాల్ వర్మ.. ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. అందులో దర్శకుడు బోయపాటి శ్రీను పేరు కూడా ఉంది. ఒకానొక టైంలో అతని పేరు తెగ ట్రెండ్ అయ్యింది.
మెగా అభిమానులు సైతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిరు రీ-ఎంట్రీ ఇస్తే బెటర్ అని అభిప్రాయపడ్డారు. ఆ టైంలో ‘సింహా’తో బాలకృష్ణకి అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి. ఇక అప్పుడు బాలకృష్ణ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఫేడౌట్ అయిపోయాడు.. ఇక రిటైర్మెంట్ ఇచ్చేస్తే బెటర్’ అని బాలయ్య అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్న టైంలో ‘సింహా’తో బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది.. గుర్తుచేశాడు బోయపాటి శ్రీను.
ఆ సినిమా చూసి చిరంజీవి సైతం ఇంప్రెస్ అయిపోయారు. మాస్ సినిమాలకి ఆదరణ తగ్గిపోతున్న రోజుల్లో బాలయ్యతో ‘సింహా’ వంటి సినిమా చేయడం.. దాంతో హిట్టు కొట్టడం అనేది చిన్న విషయం కాదు. బోయపాటిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు చిరు. తర్వాత తన రీ- ఎంట్రీ సినిమా కోసం మంచి కథ ఉంటే చెప్పమని స్వయంగా అడగడం కూడా జరిగింది. ‘సరైనోడు’ టైంలో కూడా చిరు మరోసారి బోయపాటిని రిక్వెస్ట్ చేశారు.
ఆ ప్రాజెక్టుని ‘గీతా ఆర్ట్స్’ పై అల్లు అరవింద్ నిర్మించడానికి సన్నాహాలు చేశారు. కానీ ఎందుకో చిరు- బోయపాటి ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. తర్వాత వినాయక్ దర్శకత్వంలోనే ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు చిరు. ఒకానొక టైంలో బోయపాటి కూడా చిరుతో సినిమా చేయకపోవడంపై స్పందించారు. చిరు ఇమేజ్ కి తగ్గ కథ ఆయన వద్ద లేదని.. అది కుదిరినప్పుడు కచ్చితంగా వెళ్లి చెబుతానని బోయపాటి చెప్పారు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి