నలుగురు పెద్దోళ్ల దగ్గర ఓ చిన్నోడు వెళ్లి నిల్చుంటే ఎలా ఉంటుంది? ఈ దృశ్యానికి నిలువెత్తు రూపం కావాలి అంటే రానున్న సంక్రాంతి సీజన్ సినిమాలు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే అలాంటి కాన్సప్ట్‌లో సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి మరి. అయితే ఆ చిన్న సినిమాలో పెద్ద నటుడు ఉన్నారా? అంటే సినిమా టీమ్ సమాధానం చెప్పడం లేదు. దీంతో ఏదో స్పెషల్ ఎలిమెంట్ ఉంది అని చెప్పకనే చెబుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు.
‘హను – మాన్’… సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఎప్పుడో సెన్సార్ పూర్తి చేసుకుంది. అంటే తొలుతగా రెడీ అయిన సినిమా ఇదే. కానీ ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ఈ సినిమాను వాయిదా వేయిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. ఆ డిస్కషన్‌తో ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే మరో విషయం కూడా ఈ సినిమా గురించి వినిపిస్తోంది. అదే ‘ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారా?’ అని
‘హను – మాన్’ (Hanu Man) సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అందరికీ వచ్చిన అనుమానం… ‘ఈ సినిమాలో చిరంజీవి ఉన్నారా?’ అని. ఎందుకంటే సినిమా ట్రైలర్‌లోని హనుమంతుడి పాత్రధారి కళ్లు అచ్చం చిరంజీవి కళ్లలా ఉన్నాయి. దీంతో సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపిస్తారు అని అంచనాలు వేయడం ప్రారంభించారు. అంతేకాదు చిరంజీవి హనుమంతుడి భక్తుడు. కాబట్టి ఈ సినిమాలో చిరు నటించి ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోయాయి.
ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ దగ్గర ప్రస్తావిస్తే సరిగ్గా స్పందించలేదు. సినిమా వచ్చాక మీరే చూసి తెలుసుకోండి అంటూ సస్పెన్స్‌లో పెట్టేశారు. దీంతో ఆ పాత్ర చిరంజీవి కాదు అని ఆయన కొట్టి పారేయలేదు. అలా అని అవును అని కూడా చెప్పలేదు. ఇక ఈ సినిమాను సంక్రాంతికి ఎలాగైనా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మరి రానున్న రెండు వారాలు అంతా సవ్యంగా సాగితే ‘హను మాన్’ను థియేటర్లలో చూసేయొచ్చు.