2026 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం తలచుకుంటేనే ట్రేడ్ వర్గాలకు వణుకు పుడుతోంది. ఇది మామూలు పండగ సీజన్ కాదు, ఏకంగా ఆరుగురు స్టార్లు బరిలోకి దిగుతున్న అతిపెద్ద ‘సినిమా జాతర’. మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకవైపు ఉంటే.. విజయ్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి వంటి క్రేజ్ ఉన్న హీరోలు మరోవైపు సై అంటున్నారు. దీంతో థియేటర్ల పంపకాలపై పెద్ద తలనొప్పి ఖాయమని అంతా భావించారు.
అయితే, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. ఈ సంక్రాంతి రేసులో ఉన్న ఇద్దరు అతిపెద్ద హీరోలు, ‘మన శంకర వరప్రసాద్ గారు’ (చిరంజీవి), ‘ది రాజా సాబ్’ (ప్రభాస్) చిత్రాల నిర్మాతలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అనవసరమైన పోటీతో కలెక్షన్లు పంచుకోవడం కంటే, ఇద్దరూ కలిసి స్క్రీన్లను సామరస్యంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ ‘పెద్దల ఒప్పందం’ వెనుక బలమైన వ్యూహమే ఉంది. ఇద్దరు టాప్ హీరోలు కొట్టుకుంటే, ఆ గ్యాప్‌లో వేరే సినిమాలు లాభపడే అవకాశం ఉంది. అలా కాకుండా, ఇద్దరూ ముందే మాట్లాడుకుని థియేటర్లను బ్లాక్ చేసుకోవడం ద్వారా, తమ సినిమాలకు భారీ ఓపెనింగ్స్‌ను గ్యారంటీ చేసుకుంటున్నారు. ఇది ఇద్దరు హీరోల చిత్రాలకూ ‘విన్ విన్’ సిట్యువేషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కానీ, ఈ ఇద్దరు పెద్ద హీరోలు చేతులు కలిపితే, మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి? చిరంజీవి, ప్రభాస్ చిత్రాలకే అగ్రతాంబూలం దక్కితే, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలకు నామమాత్రపు స్క్రీన్లే మిగులుతాయి. ఈ ‘సీక్రెట్ డీల్’ వార్త ఇప్పుడు మిగతా నలుగురు హీరోల నిర్మాతల్లో టెన్షన్ పెంచుతోంది.
పండగ బరిలో నిలవాలంటే వాళ్లు ఇప్పుడు కొత్త వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది కేవలం ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న మాటే అయినా, ఇందులో నిజముంటే మాత్రం 2026 సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. ఈ ఇద్దరు పెద్దల మధ్య కుదిరిన డీల్ గురించి అధికారిక సమాచారం వస్తే తప్ప, ఈ ‘తెరవెనుక ఒప్పందం‘పై పూర్తి స్పష్టత రాదు. ఏదేమైనా, ఈసారి సంక్రాంతి వార్ మామూలుగా ఉండదు.