Chiranjeevi: గిన్నిస్‌ రికార్డు వెనుక చిరు కష్టం.. ఆయన మాటల్లోనే..!

చిరంజీవి (Chiranjeevi) గొప్ప డ్యాన్సర్‌ అని ఎవరైనా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని ప్రయత్నిస్తే.. పాలు తెల్లగా ఉంటాయని సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ఉంటుంది అని అంటుంటారు. ఎందుకంటే తెలుగు సినిమాలో ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాలో డ్యాన్స్‌ అందులోనూ ప్యూర్‌ డ్యాన్స్‌ అనే మాటను తీసుకొచ్చింది మెగాస్టార్‌ చిరంజీవి. ఆ మాట మేం అంటున్నది కాదు. ఆయన గురించి ఎంతో మంది సినిమా ప్రముఖులే అన్నారు. ఇప్పుడు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా అంది.

Chiranjeevi

46 ఏళ్ల సినీ ప్రయాణంలో నటన, డ్యాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేసిన చిరంజీవి మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు ఇచ్చారు. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రిచర్డ్‌ స్టెన్నింగ్, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) చేతుల మీదుగా చిరు ఈ అవార్డు అందుకున్నారు.

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తన డ్యాన్స్‌ వెనుక కష్టాలు, ఇష్టాల గురించి వివరించారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు నేను ఊహించనిది. దానికి కారకులైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించింది అనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్‌ పైనే ఇష్టం ఎక్కువగా ఉండేది. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తూ అందర్నీ అలరించేవాడిని అని గుర్తు చేసుకున్నారు.

అలా చదువుకుంటున్న సమయంలో ఎన్‌సీసీలో చేరాక భోజనం పూర్తయ్యాక కంచాన్ని కొడుతూ స్టెప్పులేసేవాడినని చెప్పారు. తొలి సినిమా రోజుల్లో సావిత్రి (Savitri), నరసింహరాజు, రోజారమణి లాంటి వారు డ్యాన్స్‌ విషయంలో తనను ప్రోత్సహించారు అని చెప్పారు చిరు. ఓసారి వారి ముందు డ్యాన్స్‌ చేస్తుండగా కాలు జారి కింద పడిపోయాను. అయితే వాళ్లు ఏమైందా అని అనుకుంటుంటే.. దానిని సమయస్ఫూర్తితో నాగిని డ్యాన్స్‌గా మార్చేశా అని చెప్పారు చిరంజీవి.

తన డ్యాన్స్‌ చూసిన ఓ సహాయ దర్శకుడు ‘ప్రాణం ఖరీదు’ సమయంలో దర్శకుడు క్రాంతి కుమార్‌కు నా గురించి చెప్పారు. అలా నా కోసం ఓ డ్యూయెట్‌ పెట్టారు. ‘పునాది రాళ్లు’ సినిమాలోనూ డ్యాన్స్‌ విషయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాను అని అన్నారు. ఇక పాటల సంఖ్య విషయంలో నిర్మాత అశ్వినీదత్‌తో (C. Ashwini Dutt) తనకెప్పుడూ గొడవే అని నవ్వుతూ చెప్పారాయన. తన సినిమాలో ఆరు పాటలు ఉండాల్సిందే అనేవారని.. అల్లు అరవింద్‌ (Allu Aravind) కూడా ఇంతే అని చెప్పారు. అలా బాల్యంలోని తన అలవాటు ఇప్పుడు ఈ గౌరవాన్ని తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని చెప్పారు చిరంజీవి.

కె.విశ్వనాథ్ గారి శైలి సినిమాలను తలపించే చిత్రం “సత్యం సుందరం”

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus