Khushbu: భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?

పెళ్లి, భార్యాభర్తల గురించి ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు కుష్బూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. భార్యని గౌరవించని వాడు ఇతరుల మర్యాద పొందలేడు అంటూ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎందుకు ఇలా రాశారు అనేది అధికారికంగా తెలియదు కానీ.. హీరో జయం రవి గురించే అని చర్చలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని సమాజంలో ఉన్నతంగా ఉంచాలనుకుంటాడు.

Khushbu

అందుకే ప్రేమించిన వారికి తొలి స్థానాన్ని ఇచ్చి అవసరాలు, కోరికలు, స్వేచ్ఛలకు రెండో స్థానాన్ని కేటాయిస్తాడు. అలాగే ప్రతి వివాహంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగే కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. ఇలాంటి వాటి వల్ల బంధాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు కుష్బూ (Khushbu Sundar). ఒక బంధంలో రాను రాను ప్రేమ కనుమరుగు కావచ్చు. గౌరవం, మర్యాద ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలి. ఒక భర్త తప్పకుండా తన భార్యకు గౌరవాన్ని ఇవ్వాలి. కొన్నిసార్లు స్వార్థంతో తీసుకునే నిర్ణయాలకు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది.

కాకపోతే అప్పటికే ఆలస్యం అవుతుంటుంది. తన భార్యను గౌరవించలేని వ్యక్తి ఇతరుల మర్యాద, జీవితంలో ఎదుగుదలను ఆశించలేడు అని కూడా రాసుకొచ్చారామె. నిన్ను ప్రేమించిన, నీకు తోడుగా నిలబడిన వ్యక్తికి గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మరచిపోయిన వ్యక్తి బంధాన్ని, ఆనందాన్ని కోల్పొయినట్టే అని కూడా చెప్పారామె. ఇంత చెప్పిన ఆమె.. ఎందుకు చెప్పారో ఎక్కడా చెప్పలేదు. కానీ జయం రవి – ఆర్తి విడాకుల విషయం గురించే అని అంటున్నారు. మాటలు కూడా అలానే ఉన్నాయి.

జయం రవి (Jayam Ravi) – ఆర్తి విషయానికి వస్తే.. 2009లో రవి, ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని జయం రవి ఇటీవల ప్రకటించారు. కానీ తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని ఆర్తి ఆరోపించారు. అయితే ఆమెకు తెలిసి, చర్చలు జరిగాకే విడాకుల నిర్ణయం తీసుకున్నామని జయం రవి చెప్పారు.

శాండిల్‌ వుడ్‌లోనూ జస్టిస్‌ హేమ కమిటీ.. సుదీప్‌ రియాక్షన్‌ ఇదే!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus