“గీతాంజలి” తర్వాత అంజలి టైటిల్ పాత్ర పోషించిన మరో హారర్ కామెడీ “చిత్రాంగద”. “పిల్ల జమీందార్” ఫేమ్ అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. కారణాంతరాల వలన ఏడాది ఆలస్యంగా నేడు (మార్చి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సమీక్ష మీకోసం..!!
కథ : పారాసైకాలజిస్ట్ గా యూనివర్సిటీలో జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తూ.. అదే యూనివర్సిటీ హాస్టల్ లో మిగతా స్టూడెంట్స్ తో కలిసి ఉంటుంది చిత్రాంగద (అంజలి). చీకటి పడేవారకూ అందరి అమ్మాయిల్లా మామూలుగానే వ్యవహరించే చిత్రాంగద చీకటి పడ్డాక మాత్రం తన తోటి యువతులపైనే అసభ్యకరమైన విధంగా ప్రవర్తిస్తూ తన దాహార్తి తీర్చుకొంటుంటుంది. అసలు చిత్రాంగద అలా ఆడవారితో వింతగా (లెస్బియన్ లా) బిహేవ్ చేయడానికి ఓ కారణం ఉంటుంది. ఆమెకు రోజూ ఒక కల వస్తూ ఉంటుంది. ఎక్కడో అమెరికాలో ఒక వ్యక్తిని తలపై కొట్టి ఎవరో చంపేస్తున్నట్లు, దాన్ని చూస్తున్న ఆమె ఆ మృత్యుకాండను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె కలలు కంటుంది. ఆ కలకి ఆమె బిహేవియర్ కి లింక్ ఉందని తెలుసుకొని, అసలు ఆ హత్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం అమెరికా పయనమవుతుంది. అమెరికాలో చిత్రాంగద తెలుసుకొన్న నిజాలేమిటి, చనిపోయిన వ్యక్తికి చిత్రాంగదకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది “చిత్రాంగద” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : తెలుగమ్మాయి అంజలికి మొదటి నుంచి ఉన్న ఒకే ఒక్క మైనస్ ఆమె వాయిస్. ఈ సినిమాలో అమ్మడు ఏమాత్రం మొహమాటపడకుండా నడుమందాలు, భారీ తొడ సౌందర్యాలు చూపుతూ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి.. సినిమాలో కాకపోయినా తన పాత్రలో లీనం చేయడానికి పడిన శ్రమంతా ఆమె గంభీరమైన గొంతు కారణంగా ఫలించలేదు. “ఐయామ్ చిత్రాంగద” అని అంజలి అన్నప్పుడు “ఐయామ్ అన్ కంఫర్టబుల్” అని సినిమాలోని నటుడు చెప్పే డైలాగ్ ప్రేక్షకుడి అవస్థకు ప్రతిరూపం. స్వాతి దీక్షిత్, సాక్షి గులాటి లాంటి నవతరం భామలను కేవలం అందాల ప్రదర్శన కోసం వాడుకోవడం మినహా వారి పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. స్వాతి దీక్షిత్ యద లోతుల్లో ఇరికించిన కెమెరా యాంగిల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఇబ్బంది కలిగిస్తాయి.
సినిమా మొత్తంలో కాస్తో కూస్తో సరైన క్యారెక్టరైజేషన్ ఉన్న పాత్ర శాలినీదేవిది. ఆ పాత్రకు సింధు తులాని న్యాయం చేసింది. పెర్వర్ట్ గా దీపక్ ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో బొటాబోటి మార్కులు మాత్రమే సంపాదించుకొన్నాడు. ఇక కామెడియన్లు సప్తగిరి, సుడిగాలి సుధీర్ లు చేసిన కామెడీకి నవ్వాలో ఏడ్వాలో అర్ధం కాక కుర్చీలో కూలబడతాడు ప్రేక్షకుడు. సైక్రియార్టిస్ట్ గా జయప్రకాష్ పర్వాలేదనిపించుకొన్నాడు.
సాంకేతికవర్గం పనితీరు : తమిళ సంగీత దర్శకులైన సెల్వ-స్వామి ద్వయం సినిమా ఎలాగో భయపెట్టలేకపోయింది కాబట్టి పాటలతోనైనా భయపెడదాం అని ఫిక్స్ అయినట్లే ఇచ్చారు బ్యాగ్రౌండ్ స్కోర్. ఇక పాటల గురించి, అందులోని సాహిత్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. ఇండియా షూట్ వరకూ బాల్ రెడ్డి పర్వాలేదనిపించుకొన్నాడు కానీ.. అమెరికా తీసుకెళ్లి ఒక డి.ఎస్.ఎల్.ఆర్, ఒక గోప్రో చేతికిచ్చి “సినిమా కంప్లీట్ చేసేయ్” అని చెప్పడంతో చేతులెత్తేసి “ఇదిగో అయ్యింది” అనిపించాడు. నిర్మాతలు కూడా ఇంతకు మించి ఈ సినిమాకి పెట్టడం వేస్ట్ అనుకొన్నారో లేక.. మరింకేదైనా రీజనో తెలియదు కానీ, డబ్బింగ్ దగ్గర్నుంచి, డి.ఐ వరకూ ఏ ఒక్క టెక్నికాలిటీలో కూడా క్వాలిటీ కనిపించదు.
ఇక దర్శకుడు విషయానికొస్తే.. అశోక్ తీసిన “సుకుమారుడు” చిత్రాన్ని చూసినప్పుడే ఇతగాడేనా “పిల్ల జమీందార్” చిత్రాన్ని తెరకెక్కించి అనే డౌట్ చాలా మందికి కలిగింది. కానీ “ద్వితీయ విఘ్నం”లే అని సరిపెట్టుకొన్నారు. కానీ.. “చిత్రాంగద” చూశాక మాత్రం ఆ అనుమానం నిజమయ్యే అవకాశాలు లేకపోలేదనే నమ్మకం ప్రేక్షకుల్లో కలగడం ఖాయం. చివరి 15 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా చెప్పుకొనే స్థాయిలోనే కాదు కానీసం ఓపిక తెచ్చుకొని చూసే స్థాయిలో కూడా లేకపోవడం గమనార్హం.
విశ్లేషణ : కన్నడ, భోజపురి భాషల్లో తెరకెక్కే సీ గ్రేడ్ సినిమాల టేకింగ్ “చిత్రాంగద” కంటే వంద రెట్లు బెటర్. అంజలి అందాల ఆరబోత మినహా ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా లేని ఈ చిత్రాన్ని థియేటర్లో కూర్చొని 144 నిమిషాలపాటు చూడడం కంటే చిరాకైనా విషయం మరొకటి ఉండదు!