మొన్నీమధ్య పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఐదారు రోజులు షూటింగ్ చేస్తే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పనులు అయిపోతాయి అన్నాడు గుర్తుందా? అప్పుడు కొంతమంది అప్పుడే ఎలా పూర్తయిపోతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా టీమ్ ఇచ్చిన అప్‌డేట్ చూస్తే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించి పవన్ కల్యాణ్ షెడ్యూల్ అయిపోయిందట. ఈ వార్త విని ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే పవన్ మరో మాట కూడా నిజమయ్యేలా ఉంది. అదే సంక్రాంతి రిలీజ్.
అవును, ఆ రోజు మరో ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సంక్రాంతి సీజన్‌కి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. లేదంటే కొద్ది రోజులు అటు ఇటు అవ్వొచ్చు అని కూడా అన్నారు. ఆ లెక్కన ఇప్పుడు పవన్ కల్యాణ్ షూటింగ్ అయిపోయింది అంటే కచ్చితంగా సంక్రాంతి సీజన్‌కు సినిమాను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే పూర్తయింది పవన్ షూటింగ్ మాత్రమే. అంటే సినిమా షెడ్యూల్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఇతర తారాగణం మీద ఆ సీన్స్ తీయాలి.
విజువల్ ఎఫెక్ట్స్ లాంటివి ఈ సినిమాకు చాలా తక్కువగా వాడతారు కాబట్టి ఆ పని తక్కువ. పోస్ట్ ప్రొడక్షన్ అయితే పని అయిపోయినట్లే. ఇక డబ్బింగ్ అంటారా? పవన్ అయితే ఒక్క రోజులో పూర్తి చేస్తారు. మొన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాకు ఇలానే చేశారు కూడా. కాబట్టి సంక్రాంతి సీజన్‌కు సినిమా రెడీ అవ్వొచ్చు. ఎందుకంటే ఇంకా ఐదు నెలలు ఉంది. అయితే ఇక్కడ సమస్య సంక్రాంతి స్లాట్స్ ఏవీ ఖాళీ లేవు. చిరంజీవి – అనిల్ సినిమా ఆ డేట్‌కే ఉంది. ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. చిరు సినిమా ఉండగా పవన్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ తేలాలంటే టీమ్ ఓపెన్ అవ్వాలి. అవుతుంది కూడా.