“మర్యాద రామన్న” హిందీ రీమేక్ గా తెరకెక్కిన సినిమా “సన్నాఫ్ సర్దార్”. అజయ్ దేవగన్ టైటిల్ పాత్రలో నటించిన ఆ చిత్రం బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. అందుకే.. మాతృకతో సంబంధం లేకుండా సీక్వెల్ అనౌన్స్ చేశారు. అదే అమాయకమైన సర్దార్ మరో ఇరకాటంలో పడ్డాక ఏమైంది అనేది మూలకథగా రూపొందిన “సన్నాఫ్ సర్దార్ 2” గత నెలాఖరున విడుదలవ్వాల్సి ఉండగా, సరైన బుకింగ్స్ లేక పోస్ట్ పోన్ అయ్యి ఇవాళ (ఆగస్ట్ 01) విడుదలైంది. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ:
భార్య కోసం లండన్ వచ్చిన జస్సీ (అజయ్ దేవగన్) ఆమె మోసం చేయడంతో ఏం చేయాలో తోచక కంగారుపడుతుంటాడు. అదే సమయంలో పాకిస్తానీ అయిన రాబియా (మృణాల్) తన అక్క కూతురు పెళ్లి కోసం తండ్రిగా నటించే వ్యక్తి కోసం వెతుకుతుండగా.. జస్సీ తారసపడతాడు.
అమాయకుడైన జెస్సీని ఒప్పించి మరీ రాజా (రవికిషన్) కొడుకుతో పెళ్లికి అతడి ప్యాలెస్ కు వెళతారు. జస్సీ ఎక్స్ ఆర్మీ అని అబద్ధం చెప్పడంతో అసలు సమస్య మొదలవుతుంది.
జస్సీ-రాబియా కలిసి సాబా (రోహిణి వాలియా) పెళ్లిని ఎలా జరిపించారు? అందుకోసం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనేది “సన్నాఫ్ సర్దార్ 2” కథాంశం.
నటీనటుల పనితీరు: ఎందుకో ఈ సినిమా విషయంలో ఎవరి నటనలోనూ సహజత్వం కనిపించలేదు. అందరూ మొక్కుబడిగా నటించారు లేదా అవసరమైన దానికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు. అందువల్ల ఎవరి పాత్రను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోయాం. తెలుగు సినిమాల్లో ఎంతో అందంగా, పద్ధతిగా కనిపించే మృణాల్ బాలీవుడ్ సినిమాల విషయంలో మాత్రం ఎందుకని అనవసరమైన ఎక్స్ పోజింగులకు పోతుందో అర్థం కాదు. చంకీ పాండే, శరత్ సక్సేనా, ముకుల్ దేవ్ ల కామెడీ ఓ మోస్తరుగా నవ్వించింది.
దీపక్ దోబ్రియాల్ ను పాపం సినిమా మొత్తం ట్రాన్స్ జెంబర్ గా చూపించేందుకు తెగ కష్టపెట్టారు. ఆ క్యారెక్టరైజేషన్ వల్ల సినిమాకి ఒరిగింది కూడా ఏమీ లేదు.
సాంకేతికవర్గం పనితీరు: సీజీ వర్క్ చాలా పేలవంగా ఉంది. కొన్ని ఫ్రేమ్స్ లో గ్రీన్/బ్లూ మ్యాట్ షాట్స్ చాలా దారుణంగా తేలిపోయాయి. ఒక భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలో ఈస్థాయి బడ్జెట్ మ్యానేజ్మెంట్ అనేది ఎవ్వరూ ఊహించి ఉండరు.
సినిమాటోగ్రఫీ వర్క్ కూడా ఆకట్టుకోలేకపోయింది. నేపథ్య సంగీతం సోసోగా ఉండగా.. ప్రొడక్షన్ డిజైన్ వర్క్ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు అనిపించకమానదు.
దర్శకుడు విజయ్ కుమార్ అరోరా పంజాబీ సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పేరు. ఇవాళ ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో ఆయన మునుపటి చిత్రం “గొడ్డే గొడ్డే చా”ను ఉత్తమ పంజాబీ చిత్రం అవార్డు కూడా వచ్చింది. కానీ.. “సన్నాఫ్ సర్దార్” విషయంలో మాత్రం ఆయన పెద్దగా ఆకట్టుకోకపోయాడు. ఆర్మీ ట్యాంకర్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ మినహా సినిమాలో పెద్దగా నవ్వించిన సందర్భాలు లేవు. ఇక రవికిషన్ బట్లర్ ఇంగ్లీష్ తో చేయించిన కుళ్ళు కామెడీ చాలా హేయంగా ఉంది. స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలోనో లేక కమర్షియల్ సినిమాను హ్యాండిల్ చేయడంలోనో అరుణ్ కుమార్ ఆకట్టుకోలకపోయాడు అనే చెప్పాలి.
విశ్లేషణ: కన్ఫ్యూజన్ కామెడీ అనేది ఎప్పటికీ సక్సెస్ ఫుల్ జోనరే. అయితే.. ఆ జోనర్ లో హాస్యం ఎంత ఆర్గానిక్ గా పండుతుంది అనేది కీలకమైన అంశం. ముఖ్యంగా ఎప్పుడో పదేళ్ల క్రితం హిందీ, తమిళ, మలయాళ సినిమాల్లో చూసేసిన డైలాగ్స్, సీక్వెన్సులతో ఇప్పుడు ఎంటర్టైన్ చేయాలి అనుకోవడమే అత్యాశ. అందుకు తగ్గట్లే అజయ్ దేవగన్ సినిమాలో చాలా నీరసంగా కనిపిస్తాడు. ఆ క్లైమాక్స్ లో వచ్చే కాసిన్ని నవ్వులు తప్ప సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయిందనే చెప్పాలి.
ఫోకస్ పాయింట్: బోర్ కొట్టిన సర్దార్ జీ జోక్స్!
రేటింగ్: 1.5/5