సినిమా కోసం కష్టపడటంలో.. ఈ క్రమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకపోవడంలో టాప్‌లో ఉండే హీరోల లిస్ట్ అంటూ ఒకటి రాస్తే.. దేశంలో టాప్ ప్లేస్‌లో ఉండే హీరో విక్రమ్ (Vikram) అని చెప్పాలి. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు, దానికి పడ్డ కష్టం చూస్తే మీరే చెప్పేస్తారు ఆ మాట. రీసెంట్ విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాల విషయంలో అతను చేసిన శ్రమ.. దాంతో వచ్చిన ఇబ్బందుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.
కమర్షియల్ కథల కన్నా ప్రయోగాత్మక చిత్రాలకే విక్రమ్ పెద్ద పీట వేస్తాడు. అలా ‘పితామగన్’, ‘కాశీ’, ‘అపరిచితుడు’ ‘ఐ’ లాంటి వైవిధ్య సినిమాలు చేశాడు. ఇటీవల ‘తంగలాన్’తో (Thangalaan) మరోసారి ప్రయోగం చేసి చూపించాడు. మీ ప్రయోగాల ముచ్చటేంటి అని అడిగితే.. 2001లో వచ్చిన ‘కాశీ’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ సినిమాలో విక్రమ్ (Chiyaan Vikram) అంధుడిగా నటించిన విషయం తెలిసిందే.
‘కాశీ’ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ తదితర అవార్డులు అందుకున్నాడు విక్రమ్. ఈ సినిమాలో పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. పాత్రకు తగ్గట్టు మారడం, నటించడమంటే ఇష్టం. ‘కాశీ’ సినిమా కోసమూ అదే పని చేశా. ఆ సినిమాలో నటించిన తర్వాత రెండు, మూడు నెలల పాటు నా కంటి చూపు మందగించింది అని చెప్పాడు విక్రమ్ (Chiyaan Vikram).
ఆ రోజుల్లో సరిగా చూడలేకపోయేవాడిని కూడా. ఆ సినిమాలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూసేవాడిని. ఆ ప్రభావం నా కంటి చూపుపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు అని విక్రమ్ ‘కాశీ’ సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ‘ఐ’ సినిమా సమయంలోనూ ఇలానే ఆరోగ్యపరంగా ఇబ్బందిపడ్డాను అని విక్రమ్ అదే ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మాటలు విన్నప్పుడు విక్రమ్‌లా ఉండటం కష్టమే అనిపిస్తుంది కదా.