ఈ మధ్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు మరణిస్తూ వస్తుండడం అందరినీ కలవర పరుస్తుంది. మొన్నటికి మొన్న నిర్మాత మహేష్ కోనేరు మరణించారు. ఇటీవల కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా ఆకస్మిక మరణం చెందాడు. వీరి మరణాల వల్ల సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో సినీ ప్రముఖుడు మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టే అంశం.వివరాల్లోకి వెళితే… ప్రముఖ కొరియోగ్రాఫర్ కూల్ జయంత్ బుధవారం నాడు ఉదయం చెన్నైలో మృతి చెందారు.
కెరీర్ ప్రారంభంలో డాన్సర్‌గా పలు వేడుకల్లో షో లు చేసిన ఈయన అటు తర్వాత ఎంతో కష్టపడి డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగాడు. ప్రభుదేవా, రాజు సుందరం వంటి స్టార్ కొరియోగ్రాఫర్ల వద్ద ఓ డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ … దాదాపు 800 చిత్రాల వరకు డ్యాన్సర్ గా చేసారు. కొంతకాలం తర్వాత ‘కాదల్ దేశం’ అనే చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ గా మారారు. తమిళ్ తో పాటు మలయాళ భాషల్లో కలుపుకుని 100కు పైగా చిత్రాలకు కొరియోగ్రాఫీ అందించారు జయంత్.
మలయాళ స్టార్ హీరోలైన మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారి సినిమాలకి కూడా ఈయన పనిచేసారు. కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన బుధవారం నాడు వెస్ట్ మాంబళంలోని తన సొంతింట్లో తుది శ్వాస విడిచారు.ఈయన వయసు కేవలం 44 ఏళ్ళు మాత్రమే. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం పట్ల తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు చింతిస్తూ సంతాపం తెలుపుతున్నారు. బుధవారం నాడు సాయంత్రం చెన్నైలోనే జయంత్ అంత్యక్రియలు జరిగాయి.