పెద్దవాళ్లను గౌరవించండి, మీ గౌరవాన్ని పెంచుకోండి అంటుంటారు మన పెద్దలు. అంటే వాళ్లకేదో అంబారీలు కట్టి, గజమాలలు వేమయని కాదు. తమను కలవాడానికి వచ్చిన పెద్దవాళ్లను (అంటే వయసు రీత్యా, హోదా రీత్యా, సమాజంలో పలుకబడి రీత్యా) సముచిత గౌరవం ఇవ్వాలి. అయితే సినిమా వాళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గత జమానా పెద్దలు ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. మీటింగ్‌లో జరిగిందంతా పక్కనపెట్టి.. వాళ్లను బతిమలాడుకున్న వీడియోను మాత్రమే రిలీజ్ చేసి అదో రకం ఆనందం పొందారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది, పద్ధతులు మారాయి. అందుకే నాడు అమర్యాదను ఎదుర్కొన్న చిరంజీవికి (Chiranjeevi) ‘ముందస్తు’ గౌరవం దక్కింది. ఏపీ సినిమాటోగ్రీఫీ మంత్రిగా ఇటీవల ఎంపికైన జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ‘విశ్వంభర’ (Vishwambhara) సెట్స్‌కి వచ్చి చిరును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్ ఈ రోజు బాధ్యత స్వీకరణ చేయనున్న విసయం తెలిసిందే. మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌కి విచ్చేశారు.
ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని మంత్రి చెప్పారని చిరు తెలిపారు. దీనికి సంబంధించిన ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు, వీడియో చూసి అభిమానులు ఇది కదా గౌరవం అంటే.. అని మురిసిపోతున్నారు.
సినిమా సమస్యల కోసం మాట్లాడటానికి వస్తే బతిమలాడించుకున్న మంత్రి, ముఖ్యమంత్రి ఒకవైపు.. చిరంజీవి దగ్గరికే వచ్చి ఆశీస్సులు తీసుకున్న మంత్రి మరోవైపు అంటూ తూకమేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని స్టేట్ గెస్ట్‌గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం, ఆయన వెళ్లడం మీకు తెలిసిందే. ఆ తర్వాత స్టేజీ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చిరంజీవి, పవన్‌తో (Pawan Kalyan) చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేయడం కూడా చూసే ఉంటారు.