ప్రతినాయకుడిగా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “క్లాప్”. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి పృధ్వి ఆదిత్య దర్శకుడు. థియేటర్లలో విడుదల చేయడానికి ప్రయత్నించి.. కుదరకపోవడంతో ఒటీటీ రిలీజ్ చేశారు. సోనీ లైవ్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ స్పోర్ట్స్ ఫిలిమ్ ఎలా ఉందో చూద్దాం..!!
కథ: విష్ణు (ఆది పినిశెట్టి) నేషనల్ లెవల్ రన్నర్. ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లాల్సిన తరుణంలో ఓ యాక్సిడెంట్ కారణంగా తండ్రితోపాటు ఒక కాలు కూడా కోల్పోతాడు. తండ్రి మరణం కారణంగా వచ్చిన గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా జీవితంలో ఎలాంటి ఆనందం లేకుండా నిర్జీవంగా బ్రతికేస్తుంటాడు.
అలాంటి తరుణంలో భాగ్యలక్ష్మి (కృష కురూప్) అనే రన్నర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేషనల్స్ కి వెళ్లలేకపోతుంది అని తెలుసుకొని.. ఆమెకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంటాడు.
అయితే.. స్పోర్ట్స్ హెడ్ అయిన వెంకట్రామ్ (నాజర్) ప్రతి దశలోనూ విష్ణు ఆశల్ని, కలల్ని తోక్కేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ అవాంతరాలను ఎదుర్కొని.. భాగ్యలక్ష్మి కాళ్ళల్లో తన గెలుపుని విష్ణు ఎలా చూసుకున్నాడు? అనేది “క్లాప్” కథాంశం.
నటీనటుల పనితీరు: కాలు కోల్పోయి, జీవితంపై ఆశలేకుండా బ్రతికేసే ఓ అసమర్ధుడి పాత్రలో ఆది పినిశెట్టి నటన బాగుంది. చక్కని ఎమోషన్స్ ను తన హావభావాలతో ప్రతిబింబించాడు. చాలా బరువైన పాత్రను ఈజ్ తో ప్లే చేశాడు.
ఆకాంక్షది హీరోయిన్ క్యారెక్టర్ అనే కంటే సపోర్టింగ్ రోల్ అనొచ్చు. ఆమె పరిధిలో బాగానే నటించింది. నాజర్, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్, మైమ్ గోపీలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రన్నర్ గా కృష కురూప్ ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: చాన్నాళ్ల తర్వాత ఇళయరాజా నేపధ్య సంగీతం వినడం ఒక మంచి ఫీల్ ఇచ్చింది, ఎమోషనల్ సీన్స్ కు ఆయన నేపధ్య సంగీతం ప్రాణం పోసింది. అయితే.. పాటలు, గాత్రాలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.
కెమెరా వర్క్ మైనస్ అయ్యింది. ఒక స్పోర్ట్స్ డ్రామాకు కావాల్సిన ఫ్రేమ్స్ ఎక్కడా సినిమాలో కనిపించలేదు. అలాగే.. సన్నివేశానికి తగ్గ లైటింగ్ & టింట్ ను సెలక్ట్ చేసుకోలేదు సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్.
సీజీ వర్క్ చాలా పేలవంగా ఉంది. ఎంత తక్కువ బడ్జెట్ లో తీసినప్పటికీ.. ఎమోషన్ క్రియేట్ చేయాల్సిన బ్యాక్ డ్రాప్ లేకపోతే చాలా కష్టం. ఈ విషయాన్ని ప్రొడక్షన్ డిజైన్ టీం కానీ ఆర్ట్ టీం కానీ అర్ధం చేసుకోకపోవడం పెద్ద మైనస్.
దర్శకుడు ప్రవీణ్ రాసుకున్న కథలో ఉన్న దమ్ము.. కథనంలో లేదు. తాను సాధించలేకపోయిన విజయాన్ని తన స్టూడెంట్ ద్వారా పొందాలనుకునే కాన్సెప్ట్ మన ప్రేక్షకులకు కొత్త కాదు. అలాంటప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 1991లో ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన “అశ్విని” సినిమా “క్లాప్” కంటే 10 రెట్లు బెటర్ అనిపిస్తుంది. చక్కని క్యాస్టింగ్ నుండి అంతే చక్కని నటన రాబట్టుకోవడంలో విజయవంతమైన ప్రవీణ్.. కథకుడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ: ఒక స్పోర్ట్స్ డ్రామాకు కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ అయిన ఎమోషన్, డెప్త్ లేకపోవడంతో “క్లాప్” ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఆది నటన కోసం మాత్రమే సోనీ లైవ్ లో ఓపిగ్గా ఒక్కసారి చూడొచ్చు.