‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలు ఇంటింటా వివరించాలి
ఈ నెల 20 నుండి 26 వరకు కూటమి ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలి
దీపావళి పండుగ కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్…త్వరలోనే మిగతా హామీల అమలు
వైసీపీ ఐదేళ్ల పాలనలో అన్నీ భయంకర పరిస్థితులే…అస్తవ్యస్థంగా ఆర్థిక వ్యవస్థ
కూటమి ప్రభుత్వంలో అన్నింటినీ చక్కదిద్దుతూ అడుగులు ముందుకు వేస్తున్నాం
టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా
కూటమి పార్టీల ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీ సమావేశంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఈ నెల 20 నుండి వారంరోజుల పాటు చేపట్టబోయే ‘ఇది మంచి ప్రభుత్వం’ పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి :- ‘కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావొస్తోంది…ఈ వంద రోజుల్లో పాలనాపరంగా 1000 అడుగులు ముందుకు వేశాం. ఈనెల 20వ తేదీ నుండి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలి. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ. ప్రజాప్రతినిధులంతా నెలకు పది రోజుల పాటు ప్రజల్లో ఉండాలి’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం కూటమి ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసగించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రంలో భయంకర పరిస్థితులు
‘వైసీపీ పాలనలో రాష్ట్రంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. నన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పరామర్శకు పవన్ కళ్యాణ్ రాకుండా బుక్ చేసుకున్న విమానాన్ని రద్దు చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే నందిగామలో అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని ధర్నా చేశారు. సాధారణంగా షూటింగ్ లో చేయాల్సినవి…నిజ జీవితంలో కూడా చేసి పోరాట యోధునిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. రాజకీయాల్లోకి పవన్ ఒక ఆశయంతో వచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తుపెట్టుకున్న సమయంలో ఓట్లు చీలకుండా ఉండేందుకు పోటీ చేయకుండా అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. రాజమండ్రి జైల్లో నన్ను కలిసి వచ్చిన అనంతరం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ప్రజలు గెలవాలి…రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాం. సీట్లు సర్దుబాటుతో పాటు ఇతర అంశాల్లో కూడా ఎక్కడా చిన్న సమస్య రాకుండా చూసుకున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం. మోదీ 3వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వం రాకుండా ఉంటే వెంటిలైటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కష్టంగా ఉండేది.’ అని చంద్రబాబు అన్నారు.
మూడు పార్టీల ఆలోచనలు భిన్నంగా ఉన్నా..ధ్యేయం రాష్ట్రాభివృద్ధే
‘వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడింది. ఖర్చు పెట్టిన డబ్బుకు లెక్కలు చూపలేదు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మనల్ని ప్రజలు గెలిపించారు…చాలా ఆశలు పెట్టుకున్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించడం నా రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 1994లో కూడా ఇంత మెజారిటీ రాలేదు. మూడు పార్టీలు అనుసరించిన విధానమే ఈ ఘన విజయానికి కారణం. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారు మెచ్చుకునేలా మన నడవడిక ఉండాలి. మూడు పార్టీలలో విభిన్న ఆలోచనలు ఉన్నా రాష్ట్రాభివృద్ధే మన ధ్యేయం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. 100 రోజుల పాలనలో మన ప్రభుత్వం ఏం చేసింది…ఏం చేయబోతోందో కూడా ప్రజలకు వివరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలి. మన ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగించాలి.’ అని చంద్రబాబు అన్నారు.
ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీరు
‘నరేంద్ర మోదీ 3వ సారి పీఎం అయ్యి ధృడమైన సంకల్పంతో వికసిత్ భారత్-2047తో ముందుకు వెళ్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగాలు, ఇతర మార్పులు తీసుకొస్తున్నారు. వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాబోయే 3 ఏళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. మీ నియోజకవర్గాల పరిధిలో జాతీయ రహదారులను ఫాస్ట్ ట్రాక్ లో పెట్టుకునేలా మీరు కృషి చేయాలి. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం 50 శాతం నిధులు ఇస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా పథకాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేసింది. దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత నీళ్లు అందిస్తాం.’ అని హామీ ఇచ్చారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు ఒక రికార్డ్
‘స్థానిక సంస్థలకు గతంలో రూ.990 కోట్ల నిధులను ఆర్థిక సంఘం ఇవ్వలేదు… వాటిని కూడా మన ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసింది. మరో రూ.1100 కోట్లు కేంద్రం నుండి మ్యాచింగ్ గ్రాంట్ గా వచ్చాయి. మరో రూ.2 వేల కోట్లను కేంద్రం అందిస్తుంది. ఉపాధి హామీ పనిదినాలను ఆమోదించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ ఆలోచన రావడం అద్భుతం. రూ.4,500 కోట్ల పనులకు గ్రామ సభల ద్వారా ఆమోదం కూడా తెలపడం ఒక చరిత్ర. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు…అందుకే వరల్డ్ రికార్డు లభించింది. గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్రం రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. రైల్వే లైన్లకు కూడా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు. దీంతో జోన్ కార్యాలయం ఏర్పాటు కాలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అవసరమైన భూమి ఇచ్చింది. త్వరలోనే రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని కేంద్రం తెలిపింది. భారత ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెట్టింది.’ అని సీఎం వివరించారు.
గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు…7.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
‘పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకుని 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తోంది. దీనికి కొంత మొత్తంలో లబ్ధిదారులను వాటాను కలుపుకుని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉండదు. దీన్ని ఒక ఉద్యమంలా మనం ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ లో పెను మార్పులు వస్తాయి. ఒకప్పుడు పొలాలకు సరిగా కరెంట్ లేని పరిస్థితి..కానీ ఇప్పుడు కుసుమ్ పథకం కింద పంపు సెట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ ద్వారా 72 గిగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాటు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తాం.’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలి
‘విజన్ 2047…కేంద్రం వికసిత్ భారత్ కు నాంది పలికింది…మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తో 2047కి విజన్ సిద్ధం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలి. మనకు ఓట్లు వేసిన ప్రజలను అన్ని విధాలా పైకి తీసుకురావడానికి కష్టపడి పనిచేద్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గుదలకు ప్రణాళిక రూపొందించుకుందాం. గత పాలకులు విచ్చలవిడిగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. లక్ష కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారు. ఇలాంటి కష్టసమయంలో అధికారంలోకి వచ్చాం. అయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహకారంతో ముందుకు అడుగేస్తున్నాం.’ అని చంద్రబాబు అన్నారు.
చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలి
‘సీఎంగా బాద్యతలు చేపట్టిన నాడు 5 ప్రధాన హామీల అమలుపై సంతకం చేశాను. 16,347 ఉద్యోగాలతో డీఎస్సీకి నిర్వహణకు శ్రీకారం చుట్టాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వెయ్యి మాత్రమే పెంచింది. కానీ మనం ఒకేసారి వెయ్యి పెంచి ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు కూడా ఇచ్చాం. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారు. సచివాలయాల చుట్టూ వృద్ధులను తిప్పి 35 మంది ప్రాణాలు తీశారు. కూటమి ప్రభుత్వం రాగానే వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజున పింఛన్లు పంపిణీ చేశాం. ప్రతి నెలా 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఉద్యోగులు గత ఐదేళ్లలో ఏనాడూ మొదటి తేదీన జీతం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు, పెన్షన్ దారులకు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నాం. మనం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం…ఇదొక భయంకరమైన చట్టం. సొంత మనుషుల్ని పెట్టుకుని రికార్డులు రాయడానికి గత పాలకులు చట్టం తెచ్చుకున్నారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చట్టం చేశారు. అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడాం. రికార్డులను గత ప్రభుత్వం తారుమారు చేసి కొన్ని లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి దోచుకున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్సాలు తగలబెట్టారు. తప్పులు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్టగొట్టారు. అందుకే నాలుగవ సంతకంలో భాగంగా 100 క్యాంటీన్లు ఏర్పాటు చేశాం…వాటిని త్వరలోనే 203కు పెంచుతాం. నైపుణ్య గణన చేస్తే బావుంటందని పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన చేపట్టబోతున్నాం.’ అని ప్రకటించారు.
151 సీట్లు వచ్చాయని విర్రవీగిన వాళ్లను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు
‘ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టేందుకు 7 శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు పరిస్థితులను వివరించాం. వాలంటీర్ల పదవీ కాలం యేడాది ముందే అయిపోయింది. వాలంటీర్ల గురించి మాట్లాడే వ్యక్తి వాళ్లను రెన్యువల్ ఎందుకు చేయలేదు.? కొంతమందితో రాజీనామాలు చేయించారు…మిగతా వాళ్లవి కాల పరమితి అయిపోయింది. 4 లక్షల మందితో నెలకు రూ.200 చొప్పున సాక్షి పత్రక కొనుగోల చేయించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎక్కడా జరగలేదు. ఆ పేపర్లో వేసే అసత్యాలు, అబద్ధాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం ఎంత చేసినా, ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలని చూసినా ప్రజలకు వాస్తవాలు తెలిస్తాయి. 151 సీట్లు వచ్చాయని విర్రవీగిని వారికి 11 సీట్లు వచ్చేలా చేశారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం. ఉచిత ఇసుకను కూడా అమలు చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి…వాటిపై ఇప్పుడు విచారణ చేస్తున్నాం. గతంలో వారు చేసిన తప్పులు మనం చేయకూడదు. అందరినీ కోరుతున్నాం….మీ నియోజకవర్గాల్లో నాయకులు జోక్యం చేసుకోకుండా ప్రజలకు ఇసుకను చేర్చగలిగితే మన గెలుపునకు దోహదం చేస్తుంది.
రెండేళ్లలో పోలవరం ఫేజ్ -1 పూర్తి చేసి జాతికి అంకితం
‘ఒక వ్యక్తి స్వలాభం కోసం మద్యం విధానాన్ని మార్చారు. సొంత బ్రాండ్లు, సొంత డిస్టలరీలు ఏర్పాటు చేసుకున్నారు. నాణ్యత లేని మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. అక్టోబరులో కొత్త మద్యంపాలసీ అమల్లోకి వస్తుంది. నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తాం. కేంద్రం పోలవరానికి రూ.12,500 కోట్ల కేంద్రం ప్రకటించింది. కొత్త డయాఫ్రం వాల్ కూడా నిర్మించాల్సి ఉంది…2 ఏళ్లలో పోలవరం ఫేజ్-1 పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు, జాతికి అంకితం చేస్తాం. అమరావతికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం. రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లు అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు నిధులు కేటాయించింది…ఈ పార్కుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. శ్రీసిటీలో 15 సంస్థలు ప్రారంభించి, మరో 6 సంస్థలకు శంకుస్థాపన చేశాం. బీపీసీఎల్ రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. విశాఖపట్నం ఎన్టీపీసీ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉంది.’ అని చంద్రబాబు వివరించారు.
పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన…చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
‘గతంలో గ్రామాల్లో 25 వేల కి.మీ సిమెంట్ రోడ్లు వేశాం. మ్యాచింగ్ ఇచ్చుకుంటే గ్రామాల్లో అన్ని పనులు చేసుకోవచ్చు. రాబోయే ఐదేళ్లలో 17 వేల కి.మీ సీసీ రోడ్లు, 10 వేల కి.మీ సీసీ డ్రెయిన్ ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన రూ.1,670 కోట్లు చెల్లించాం. రాబోయే రోజుల్లో కూడా 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తాం. రైతులకు డ్రిప్ 90 శాతం సబ్సీడీతో అందిస్తాం. రూ.340 కోట్లతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేస్తాం. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే నాటి సీఎం కనీసం అక్కడికి వెళ్లలేదు. పులిచింతల గేట్ కొట్టుకుపోతే రెండు సీజన్ల పాటు గేటు ఏర్పాటు చేయలేదు. గుండ్లకమ్మ గేటు కొట్టకుపోయింది. తుంగభద్ర గేటు కొట్టకుపోయింది. సాగుకు నీళ్లు ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు..కానీ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుని పంపి గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అడ్డుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమస్యగా చేయడానికి చూస్తున్నారు. గతంలో వాజ్ పేయ్ హయాంలో నిధులు కేటాయించి నష్టాల నుండి గట్టెక్కించాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా చూస్తున్నాం. నీరు చెట్టు, నరేగా బిల్లులు కూడా విడుదల చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. గత ఐదేళ్లు ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ముంబయిలో ఉన్న హీరోయిన్ ను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు గౌరవ వేతనం పెంచాం. బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కూడా కేబినెట్ లో ఆమోదించాం. అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపుతాం. అర్చకుల వేతం రూ.10 వేల నుండి 15 వేలకు పెంచాం.’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
ప్రతి ఒక్కరికీ ఇల్లు
‘ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. పెండింగులో ఉన్న ఇళ్లు పూర్తి చేస్తాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తాం. పట్టాదారు పాసుపుస్తకాలను రాజముద్రతో రైతులకు అప్పగిస్తాం. ఏ వ్యక్తి ఫోటోలు ఎక్కడా ఉండవు. 2047 విజన్ తో 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నాం. అసాధ్యం అంటున్నారు…సుసాధ్యం చేసి చూపిస్తాం. నూతన ఎంఎస్ఎంఈ విధానం, నూతన ఇండస్ట్రియల్ పాలసీల త్వరలో తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో పోర్టులు, ఎయిర్ పోర్టులు చాలా ముఖ్యం అవుతాయి. అన్ని ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణులను నియమిస్తున్నాం.’ అని చంద్రబాబు అన్నారు.
వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడకం
‘తిరుమల లడ్డూను కూడా గత ఐదేళ్లు నాసిరకంగా చేశారు. వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుడు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారు. వెంకటేశ్వరస్వామి ప్రతిష్టతను పెంచి పవిత్రతను కాపాడుతాం. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. ముందుగా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రూ.500 కోట్లు మంజూరు చేశాం. పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. నా జీవితంలో చాలాసార్లు చూశాను కానీ…ఇంత పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ కు దాతలు ఏనాడూ విరాళాలు ఇవ్వలేదు. మన కూటమి ఎమ్మెల్యేల తరపున కూడా ఒక నెల జీతం విరాళంగా ఇద్దాం. బుడమేరు ప్రాంతంలో కబ్జాలు పెరగడం వల్లే వరద ముంపునకు కారణం. బుడమేరు మరమ్మతులకు నిధులు కేటాయిస్తే గత ప్రభుత్వం వాటిని రద్దు చేశారు. ప్రకృతి విలయం, గత పాలకుల తప్పిదాలు ప్రజలకు శాపంగా మారి 10 రోజులు నీళ్లలోనే ఉన్నారు. 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ లో ఉండి పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని నిర్ణయించాం. 25 కేజీల బియ్యం, 5 రకాల నిత్యవసర సరుకులు అందించాం. బుడమేరు గండ్లను పూడ్చేందుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేష్ రేయింబవళ్ళు కష్టపడ్డారు. పాడైపోయిన ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ.3 వేలు ప్రకటించాం. టర్నోవర్ ను బట్టి ఎంఎస్ఎంఈలకు ప్యాకేజీని ప్రకటించాం. ఇంత పెద్ద మొత్తంలో వరద బాధితులకు ప్యాకేజీ ఎవరూ, ఎప్పుడూ ప్రకటించలేదు. పంటలకు కూడా మొదటి సారి హెక్టారకు రూ.25 వేలు పరిహారం ప్రకటించాం. నష్టపోయిన కౌలు రైతులకే నేరుగా పరిహారం అందిస్తాం.’ అని హామీ ఇచ్చారు.
దీపావలి పండుగ కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం
‘సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ రోజున మొదటి గ్యాస్ అందిస్తాం. రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి గ్యాస్ అందిస్తాం. మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు క్రమేనా అమలు చేస్తాం. మనందరిపై పవిత్రమై బాధ్యత ఉంది. ప్రతి అడుగూ ప్రజల కోసం వేయాలి. అనునిత్యం పేదల కోసం పని చేయాలి. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. ఈ వంద రోజుల పాటు మీరు చూపించిన సమన్వయం అమోఘం…దీన్ని మరింత దృఢత్వంతో ముందుకు తీసుకెళ్లాలి. వైసీపీ అనునిత్యం విషం కక్కే పనిలో ఉంది…ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా తిప్పికొట్టాలి. వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజలకు వాస్తవాలను వివరించాలి. సొంత బాబాయిని చంపి గుండెపోటు అని మొదట చెప్పి సాయంత్రానికి నారాసుర రక్త చరిత్ర అని దొంగ పత్రికలో రాసుకున్నారు. క్రూరంగా చంపిన విషయాన్ని దాచి ప్రజలను మభ్య పెట్టారు. ఇలాంటి వారి వల్ల కలిగే నష్టాలేంటో ప్రజలకు వివరించాలి. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం. గుజరాత్ లో స్థిరప్రభుత్వం కొనసాగడం వల్ల అభివృద్ధి చెందింది. 175కు 175 సీట్లు మనమే గెలుస్తాం…40 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని చెప్పం. స్థిరమైన ప్రభుత్వం వల్ల అభివృద్ధి చేసుకోగలుగుతాం. త్వరలోనే జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమిస్తాం. జిల్లాల వారీగా మూడు పార్టీల అధ్యక్షులు సమన్వయంతో పని చేయాలి. తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి…త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం. ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చేరవేయాలి.’ అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.