“నాపేరు శివ” సినిమాతో తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకొన్న దర్శకుడు సుశీందరన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “కేరాఫ్ సూర్య”. సందీప్ కిషన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని “స్వామి రారా’ ఫేమ్ చక్రి చిగురుపాటి నిర్మించారు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొంది ఒకేరోజు విడుదలైన ఈ చిత్రం ఏరేంజ్ లో ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ : సూర్య (సందీప్ కిషన్) ఒక మధ్యతరగతి యువకుడు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ లోని డాక్టర్స్ చేసిన తప్పు కారణంగా తండ్రిని కోల్పోయిన సూర్య చదువు పూర్తవ్వకుండానే చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తాడు. సూర్య చెల్లెలు కష్టపడి ఎం.బి.బి.ఎస్ చదివి పాస్ అయ్యి ఒక నర్సింగ్ హోమ్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూనే ఎం.డి చదవడానికి ప్రిపేర్ అవుతూ.. తన అన్నయ్య ఫ్రెండ్ అయిన మహేష్ (విక్రాంత్)ను సీక్రెట్ గా లవ్ చేస్తుంటుంది. కట్ చేస్తే.. సూర్య చెల్లెల్ని లోకల్ కిరాయి గూండా సాంబశివుడు (హరీష్ ఉత్తమన్) చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన సూర్య తన కుటుంబాన్ని సాంబశివుడు బారినుండి ఎలా కాపాడగలిగాడు అనేది చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : సందీప్ కిషన్ కు ఈ తరహా పాత్ర “కేక్ వాక్” లాంటిది. ఇప్పటికే ఈ టైప్ రోల్స్ చాలా సినిమాల్లో చేశాడు సందీప్. మెహరీన్ కు సినిమాలో రెండు పాటలు, అయిదు సన్నివేశాలు మాత్రమే ఇచ్చాడు డైరెక్టర్. కనిపించిన కొంత సేపట్లో కూడా నిగనిగలాడే తెలుపుతో సందీప్ కిషన్ ను డామినేట్ చేస్తూ పర్వాలేదనిపించుకొంది. సందీప్ ఫ్రెండ్ పాత్రలో విక్రాంత్, స్నేహితుడి పాత్రలో సత్య, విలన్ రోల్ లో హరీష్ ఉత్తమన్ లు రెగ్యులర్ గానే కనిపించారు. ముఖ్యంగా.. హరీష్ ఉత్తమన్ ఆహార్యంలో ఉన్న కొత్తదనం నటనలో కనిపించకపోవడం గమనార్హం. తల్లి పాత్రలో తులసి కాస్త అతి చేసింది, పోలీస్ ఆఫీసర్ గా సపోర్టింగ్ రోల్ ప్లే చేసిన ఆర్టిస్ట్ నటన విషయంలో కనీస స్థాయి మెళకువలు కూడా తెలియకపోవడంతో.. కీలకపాత్ర అయినప్పటికీ అతడి పాత్ర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోగా అదేదో స్పూఫ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు : డి.ఇమ్మాన్ ఆయన తమిళ చిత్రం “పాయంపులి” తెలుగులో “జయసూర్య” అనే టైటిల్ తో విడుదలైంది అనే విషయం మర్చిపోయాడో లేక తెలియదో కానీ.. సేమ్ టు సేమ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ను దింపేశాడు. పాటలు కూడా ఆయన మునుపటి సినిమాల్లో విన్నట్లుగా ఉంటాయి. లక్ష్మణ్ కుమార్ సినిమాటోగ్రఫీలో తమిళ వాసన గుప్పుమంది. తమిళ-తెలుగు బైలింగువల్ అయినప్పుడు రెండు భాషలకు తగ్గట్లుగా సినిమా ఉండాలి కానీ.. కేవలం తమిళంలో మాత్రమే తీసినట్లుగా అనిపిస్తుంది.
దర్శకుడు సుశీందరన్ తన మునుపటి చిత్రం “నా పేరు శివ” హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడినట్లు లేదు. అందుకే “కేరాఫ్ సూర్య” స్టోరీని కూడా సేమ్ ఫార్మాట్ లో రాసుకొన్నాడు. అయితే.. ఆ సినిమాలో ఎమోషన్స్ ను పండించిన స్థాయిలో ఈ సినిమాలో లేవు. పైగా.. ఫస్టాఫ్ పరమ రొటీన్ గా సాగుతుంది. ఇక సినిమాలో కాస్తో కూస్తో బాగుంది సెకండాఫ్ లో మొదటి 20 నిమిషాలు మాత్రమే. మళ్ళీ క్లైమాక్స్ కూడా ఊహించినట్లుగా ఉంటుంది. అందువల్ల ఆడియన్స్ థ్రిల్ అవ్వడం లేదా సినిమాలో ఎంగేజ్ అవ్వడం అనేది జరగదు.
విశ్లేషణ : ఫ్యామిలీ ఎమోషన్స్ ను బేస్ చేసుకొని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇదివరకూ కూడా చాలా వచ్చాయి. వాటిలో చాలా సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోగా.. కొన్ని సినిమాలు మాత్రం ఆదరణకు నోచుకోక వెనక్కిపోయాయి. “కేరాఫ్ సూర్య” రెండో క్యాటగరీకి చెందిన సినిమా.
రేటింగ్ : 2/5