ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ (59) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండె నొప్పికి చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. బాలచందర్ తెరకెక్కించిన ‘మనదిల్ ఉరుది వేండం’తో వివేక్ తెరంగేట్రం చేశారు. మొత్తంగా 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.
రజనీకాంత్, సూర్య, అజిత్ చిత్రాల్లో వివేక్ హాస్యనటుడిగా నటించి తెలుగు వారికి కూడా వివేక్ పరిచితులే. ఆయన ఆఖరిగా ‘ధరాల ప్రభు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ఇండియన్ 2’ లో కూడా నటించారు. ‘బాయ్స్’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘సింగం’, ‘సింగం-2’, ‘రఘువరన్ బి టెక్’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలతో వివేక్ తెలుగువారికి దగ్గరయ్యారు. వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.