సోషల్ మీడియా వచ్చిన తరువాత సినీ సెలెబ్రిటీలతో నేరుగా.. వారు అనుకునే విషయాన్ని తెలియజేస్తున్నారు నెటిజన్లు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. కానీ వారి పర్సనల్ లైఫ్ కు సంబందించిన కొన్ని ప్రశ్నలు కూడా అడిగి వారిని ఇబ్బంది పెట్టడం.. అలాగే ఇష్టమొచ్చిన పదజాలంతో వారిని విమర్శించడం వంటివి ఎక్కువ అవుతున్నాయనే చెప్పాలి. కొంతమంది ఆకతాయిలు పనిగట్టుకుని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. ఇవి ఎక్కువ జరుగుతున్నాయని చెప్పాలి.
వారు సరదాగా కాసేపు.. లైవ్ లోకి వస్తే చాలు… వారి మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెట్టడం.. వారి ధరించే దుస్తుల పై కూడా ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయడం.. దీంతో వారు బాధపడడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల జరిగిన ‘దిశ’ సంఘటన తరువాత కొందరు ఆకతాయి నెటిజన్లు నిధి అగర్వాల్, అనసూయ వంటి వారి పై చేసిన కామెంట్లే ఇందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు. వారి కామెంట్ల పై వీరు మండిపడుతూ భాధను కూడా వ్యక్తం చేశారు. ఇక వీటన్నిటినీ అరికట్టేందుకు సైబర్ పోలీసులు రెడీ అవుతున్నారు. హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ మరియు పోస్టులు పెట్టేవారి పై సైబర్ పోలీసులు ‘ఆన్లైన్ హరాస్మెంట్’ గా పరిగణలోనికి తీసుకొని కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధించడానికి రెడీ అవుతున్నారట. ఇక నుండీ సోషల్ మీడియాలో హీరోయిన్ల పై అసభ్యకరమైన కామెంట్లు, పోస్టులు చేసే నెటిజన్లు జాగ్రత్తగా ఉండండి మరి.