టాలీవుడ్ బడా నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు. గతంలో పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు బెల్లంకొండ. అయితే తాజాగా ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు ఆయన్ని అరెస్ట్ చేయడం ఖాయమని ఫిలింనగర్లో చర్చలు మొదలయ్యాయి. ‘తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్లను.. నిర్మాత బెల్లంకొండ సురేష్ తిరిగి చెల్లించని కారణంగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కోర్టుని ఆశ్రయించారు. దీంతో బెల్లంకొండ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
అసలు విషయం ఏమిటంటే.. 2010లో ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ బాలీవుడ్ లో నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ చిత్రం అక్కడ పెద్ద హిట్టైంది. అదే కాన్సెప్ట్ తో దాదాపు టేకింగ్ తో తెలుగులో ‘జబర్దస్త్’ చిత్రాన్ని నిర్మించారు బెల్లంకొండ సురేష్. దాదాపు 19 సీన్లను ‘బాండ్ బాజా బరాత్’ నుండి కాపీ కొట్టేశారని ఆరోపిస్తూ యష్ రాజ్ ఫిలిమ్స్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ‘జబర్దస్త్’ సినిమా ప్రదర్శనను నిలిపివేసింది. అయితే ‘జబర్దస్త్’ సినిమా నిర్మాణంలో ఉండగానే టెలివిజన్ శాటిలైట్ టెలికాస్ట్ రైట్స్ ను రూ.3.5 కోట్లకు ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ కి అమ్మారు బెల్లంకొండ. యష్ రాజ్ ఫిలిమ్స్ కంప్లైంట్ ఇవ్వడం.. సినిమా నిలిపేయమని టీవీలో కూడా టెలికాస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించడంతో… 3.5 కోట్లు తిరిగి చెల్లించాలని ఆ ఎంటర్టైన్మెంట్ సంస్థ బెల్లంకొండ సురేష్ ను కోరారు. ఆరేళ్ళుగా బెల్లంకొండ డబ్బు చెల్లించకుండా ఉండడంతో ఛానెల్ యాజమాన్యం కూడా కోర్టుని ఆశ్రయించింది. అయితే బెల్లంకొండ తీసుకున్న మూడున్నర కోట్లు మొత్తం ప్రస్తుతం రూ.11.75 కోట్లకు చేరిందట. దీంతో కోర్టు బెల్లంకొండ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి దీన్ని బెల్లంకొండ ఎలా పేస్ చేస్తాడో చూడాలి.