సినిమాలు హిట్ అయితే రెండు మూడు వారాల తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేయడం, ఫ్లాప్ అయితే.. ట్రిమ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే.. మొట్టమొదటిసారిగా విడుదలైన వారం తర్వాత ఓ సినిమా క్లైమాక్స్ ను మార్చనున్నారు. ఇది ఒక డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. ఒక సినిమాకి రకరకాల క్లైమాక్స్ లు రాసుకోవడం అనేది ప్రతి కథకు సర్వసాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ.. అలా రెండు రకాల క్లైమాక్స్ లను షూట్ చేయడం అనేది మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటుంది.
మొన్నామధ్య బాలీవుడ్ సినిమా “భూల్ భులాయా” సినిమాకి ఇలాగే రెండు క్లైమాక్స్ లు షూట్ చేశారనే విషయం బాగా వైరల్ అయ్యింది. అయితే.. గతవారం థియేటర్లలో విడుదలైన “క్రేజీ” (Crazxy) అనే సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ, ఎందుకనో సరైన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా చాలామందికి క్లైమాక్స్ నచ్చలేదు. అప్పటివరకు మంచి థ్రిల్లర్ గా తీసుకెళ్ళి, సెంటిమెంటల్ గా ముగించడాన్ని చాలామందిని మెప్పించలేకపోయింది.
దాంతో.. సోహం షా & గిరీష్ కోలి ఈ సినిమా కోసం షూట్ చేసిన మరో క్లైమాక్స్ వెర్షన్ ను రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రేపటి నుండి ఈ వెర్షన్ థియేటర్లలో ప్లే అవ్వనుంది. ఒకవేళ ఈ ఫార్మాట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఈ పంథాను ఫాలో అవ్వొచ్చు. మరి ఈ క్లైమాక్స్ మార్పు “క్రేజీ” (Crazxy) సినిమా కలెక్షన్స్ కి ఏమేరకు దోహదపడుతుంది అనేది చూడాలి.